CBI Notices to MP Avinash: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో విచారణకు రావాలని ఈ నెల 22న హాజరుకావాలని.. నోటీసుల్లో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. వాట్సప్ ద్వారా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. కడప ఎంపీ ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఈనెల 16, 19న సీబీఐ విచారణకు పిలువగా.. ఆఖరి నిమిషంలో విచారణకు రాలేనంటూ లేఖలు రాశారు. కర్నూలు విశ్వ శాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లితో పాటు అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ మరోసారి దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చింది.
విచారణకు పిలిస్తే సాకులే: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచినప్పుడల్లా సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే అవినాష్ అరెస్టుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయో.. అప్పటి నుంచి విచారణకు పిలిస్తే హాజరుకాకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఆయన అలా డుమ్మా కొట్టారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున సీబీఐ పిలిచిన తేదీల్లో రాలేనంటూ విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తన తల్లి గుండెపోటుకు గురైనందున విచారణకు హాజరుకాలేనంటూ న్యాయవాది ద్వారా సీబీఐకి చివరి నిమిషంలో సమాచారం పంపారు. చివరి క్షణంలో విచారణకు వెళ్లకుండా ఆగిపోవటం గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి. కేసు దర్యాప్తు జాప్యమయ్యేలా, అరెస్టు కాకుండా వీలైనన్ని ఎక్కువ రోజులు తాత్సారం చేసేందుకే అవినాష్‌రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడు నిందితులు విచారణకు హాజరవుతారు. అవినాష్ మాత్రం ఆయన అనుకున్నప్పుడే విచారణకు వెళ్తున్నారు.