తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివేకా హత్య కేసు.. దర్యాప్తునకు కొత్త సిట్​ - Andhra Pradesh today news

EX Minister Viveka Nanda Reddy murder Updates: ఏప్రిల్‌ 30లోపు వివేకా హత్యకేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ వేసిన పిటిషన్‌ సందర్బంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని సూచించింది.

ys viveka case
supreme court

By

Published : Mar 29, 2023, 12:33 PM IST

Updated : Mar 30, 2023, 7:25 AM IST

EX Minister Viveka Nanda Reddy murder Updates: మాజీ మంత్రి, సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకా హత్య కేసుకు సంబంధించి నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో మరోసారి విచారణ జరిగింది. విచారణలో భాగంగా వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ వేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్‌ 30లోపు వివేకా హత్యకేసు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని సూచించింది. గతంలో ఇదే కోర్టు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిందని గుర్తు చేసింది.

అనంతరం సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయస్థానం తెలిపింది. దీంతో తాము కొత్త సిట్‌ను నియమించాలంటూ సీబీఐ తన ప్రతిపాదనను సుప్రీంకోర్టులో వెల్లడించింది. కొత్త సిట్‌లో.. ఎస్పీ వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, ఎస్‌.ఐ. అంకిత్‌ యాదవ్‌‌లను నియమించినట్లు పేర్కొంది. ఈ కొత్త సిట్ సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వంలో దర్యాప్తును కొనసాగిస్తుందని తెలిపింది. దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను తప్పించినట్లు సీబీఐ న్యాయస్థానం ఎదుట వివరించింది.

ఈ నేపథ్యంలో ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్‌ను మంజూరీ చేయాలంటూ తులశమ్మ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. 6 నెలల్లోపు ట్రయల్‌ మొదలుకాకపోతే సాధారణ బెయిల్‌ పిటిషన్‌కు దాఖలు చేసుకోవచ్చని.. అది కూడా మెరిట్స్‌ ఆధారంగానే బెయిల్‌పై నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం బెయిల్‌ పిటిషన్‌పై ఉండదని కూడా స్పష్టం చేసింది.

వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి మార్పుపై, ఏ5 నిందితుడు శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై, సీబీఐ నివేదికపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో రామ్‌సింగ్‌తో పాటు మరో పేరును సీబీఐ సూచించగా.. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా.. రామ్‌సింగ్‌ కొనసాగింపు అనేది అర్ధం లేనిదని, దర్యాప్తు పురోగతి లేనప్పుడు కొనసాగింపు ఎందుకని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ప్రశ్నించారు. దీంతో ఏప్రిల్ 15వ తేదీకల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని.. సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని.. ఈలోగా ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ తులశమ్మ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. మధ్యాహ్నం 2గంటలకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది.

మరోపక్క వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తాజాగా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ఇప్పుటిదాకా జరిగిన దర్యాప్తులో పురోగతి లేదంటూ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇలా ఎన్నేళ్లపాటు ఈ కేసును కొనసాగిస్తారంటూ సీబీఐని ప్రశ్నించింది. ప్రస్తుత దర్యాప్తు అధికారిని కొనసాగిస్తూనే, ఇంకొకరిని నియమించాలన్న సుప్రీంకోర్టు.. బుధవారం నాటికి నిర్ణయం చెప్పాలంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారిని మారిస్తే..వివేకా హత్య కేసు విచారణలో జాప్యం జరుగుతుందని సునీత తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయగా.. త్వరగా దర్యాప్తు జరగాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో నేడు మరోసారి విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్​ 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది.

ఇవీ చదవండి

Last Updated : Mar 30, 2023, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details