లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీకి కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. కేరళలో సంచలనం రేపిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవంటూ తిరువనంతపురం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం నివేదిక సమర్పించింది. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఊమెన్ చాందీ, కేంద్ర మాజీ మంత్రి కేసీ వేణుగోపాల్, ఇతర రాజకీయ నాయకులపై ఉన్న కేసుల దర్యాప్తును గతేడాది చేపట్టిన సీబీఐ.. ఇప్పుడు మాజీ సీఎంకు క్లీన్చిట్ ఇచ్చింది.
సోలార్ స్కామ్ 'లైంగిక వేధింపుల కేసు'లో మాజీ సీఎంకు క్లీన్ చిట్ - కేరళ మాజీ ముఖ్యమంత్రి లైంగిక వేధింపుల కేసు న్యూస్
సోలార్ స్కామ్ లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీకి ఊరట లభించింది. ఆయనకు క్లీన్చిట్ ఇస్తూ కోర్టులో సీబీఐ నివేదిక సమర్పించింది.
యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోట్లాది రూపాయల సోలార్ ప్యానల్ కుంభకోణంలో నిందితురాలైన మహిళ.. 2012లో చాందీ సహా ఆరుగురు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది. 2013 జులై 19న తిరువనంతపురం పోలీస్ కమిషనర్‌కు ఈమేరకు లేఖ రాసింది. ఈ కేసులపై తొలుత కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీపీఐ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2021 ప్రారంభంలో ఈ కేసులను సీబీఐకి అప్పగించింది.
ఈ కేసులపై సీబీఐ విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఆ మహిళ చెబుతున్న రోజున.. అప్పటి సీఎం అధికారిక నివాసానికి ఆమె వెళ్లిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఇది తప్పుడు కేసు అని సీబీఐ తన నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
చాందీకి క్లీన్‌చిట్‌పై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. చాందీ సహా ఈ కేసులో దర్యాప్తును ఎదుర్కొన్న ఇతర నేతలకు కేరళ సీఎం పినరయి విజయన్ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.