CBI FCRA funds: ఎఫ్ఐర్సీఏ నిబంధనలను పలు కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయ్నన ఆరోపణలపై సీబీఐ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, దిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్ నగరాలతో పాటు రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. మొత్తం 40 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, ఎన్జీఓలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి.
FCRA violation MHA:కేంద్ర హోంశాఖ ఎఫ్సీఆర్ఏ విభాగంలోని అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సుమారు రెండు కోట్లకు పైగా హవాలా లావాదేవీలు జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు ఏడుగురు హోంశాఖ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు విరాళాలు పొందేందుకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే, పలు సంస్థలు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లేకుండానే నిధులు సేకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని సంస్థలు అనుమతులు పొందినా.. నిబంధనలు అతిక్రమించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు అప్రమత్తమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. తాజాగా చర్యలు చేపట్టింది.