Bids For Vizag Steel Plant: విశాఖ ఉక్కులో వర్కింగ్ కేపిటల్, ముడి సరకు భాగస్వామ్యం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) కోసం బిడ్ల దాఖలు గడువు మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. 21 బిడ్లు అన్ లైన్ ద్వారా దాఖలైనట్టు తెలుస్తోంది. మరో బిడ్ సిబిఐ పూర్వపు జేడి లక్ష్మీనారాయణ నేరుగా దాఖలు చేశారు. ఇప్పటివరకు 22 బిడ్లు దాఖలైనట్టయింది.
సీబిఐ పూర్వ జేడి లక్ష్మీనారాయణ స్టీల్ ఫ్లాంట్ సీజీఎం మార్కెటింగ్ సత్యానంద్‌కి స్వయంగా బిడ్డింగ్ పత్రాలు అందజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగువారందరికి బిడ్డలాంటిదని తెలిపారు. ఉక్కు పరిశ్రమను జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యతగా అయన అన్నారు. అందువల్లనే తాము ఒక ప్రయివేటు కంపెనీ తరుఫున బిడ్ను దాఖలు చేసినట్టు లక్ష్మీనారాయణ వివరించారు. ప్రజల తరుఫున ఈ బిడ్ దాఖలు చేశామని లక్ష్మీనారాయణ వెల్లడించారు. నిధులను సేకరించేందుకు కొత్త విధానం ద్వారా ముందుకు వస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్ వంటి విధానాల ద్వారా నిధులను సేకరించే వెసులుబాటు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు రూ. 8.5 కోట్ల మంది నెలకు వంద రూపాయిల చొప్పున విరాళం ఇస్తే నెలకు రూ. 850 కోట్ల రూపాయలు జమ అవుతాయన్నారు లక్ష్మీనారాయణ. ఇలా నాలుగు నెలలు పాటు చేయగలిగితే స్టీల్ ప్లాంట్ను నిలబెట్టిన వాళ్లలో మనం కూడా ఉండే అవకాశం ఉంటుందని అయన వివరించారు.