CBI Custody Report: వివేకా హత్య కేసుకు ప్రణాళిక రూపకల్పన, కుట్ర, ఆధారాల ధ్వంసంలో వైఎస్ భాస్కరరెడ్డి పాత్ర, ప్రమేయంపై... అభియోగపత్రాలు, కస్టడీ పిటిషన్‌లో సీబీఐ చాలా కీలక అంశాలను ప్రస్తావించింది. 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు ప్రణాళిక రూపొందినట్లు సీబీఐ తెలిపింది.
హత్యకు ప్లాన్ ఇలా: వివేకానందరెడ్డిని హత్య చేస్తే నీ జీవితం సెటిలైపోతుందంటూ.. ఎర్ర గంగిరెడ్డి చెప్పారని దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. నువ్వు ఒక్కడివే కాదు, నీతో మేమూ వస్తామంటూ ప్రోత్సహించారని.. ఈ హత్య వెనుక వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారని చెప్పినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి 40 కోట్లు ఇస్తారని.. అందులో 5 కోట్లు నీకు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పారంటూ షేక్ దస్తగిరి వాంగ్మూలమిచ్చారు. వివేకాను చంపాలని చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయిలు ఇచ్చిన విషయాన్నీ వెల్లడించారు.
శివశంకర్‌రెడ్డి ద్వారా ఎర్ర గంగిరెడ్డికి, ఆయన నుంచి తనకు అందినట్లు సునీల్ యాదవ్ చెప్పాడని దస్తగిరి వివరించారు. మరోసారి నిర్ధారించుకునేందుకు సునీల్ యాదవ్‌తో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళితే.. ఫోన్‌లో శివశంకర్‌రెడ్డితో మాట్లాడించారని చెప్పారు. మేం ఉన్నామని చెప్పాక అనుమానం ఎందుకు, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేయాలని.. శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల సమయంలో తనతోపాటు మిగిలిన నిందితులను ఇంటికి పిలిపించిన గంగిరెడ్డి.. ఎవరూ భయపడవద్దని సూచించారని అన్నారు. అంతా చూసుకుంటామని శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారని భరోసా ఇచ్చారని.. మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారు.
హత్యకు కొన్ని గంటల ముందు: ఈ కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్... వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు గూగుల్ టేకవుట్ విశ్లేషణ ద్వారా సీబీఐ తేల్చింది. ఫోరెన్సిక్ విశ్లేషణలోనూ ఇదే విషయం నిర్ధారణైంది. వివేకాను చంపేందుకు గొడ్డలి కొనడానికి కదిరి వెళ్లిన షేక్ దస్తగిరి కోసం... భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంట్లో సునీల్‌యాదవ్ నిరీక్షించారని సీబీఐ తేల్చింది. అదేరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో వివేకాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పులివెందులకు తిరిగొస్తున్న సమయంలో... ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాయంత్రం 6.22 గంటల సమయంలో సునీల్‌యాదవ్‌కు రెండు సార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.
గొడ్డలి కోసం కదిరి వెళ్లిన దస్తగిరి రాత్రి ఎనిమిదిన్నరకు పులివెందులకు వచ్చి సునీల్‌యాదవ్‌ను కలిశారని సీబీఐ తెలిపింది. ముందస్తు పథకం ప్రకారం ఆ సమయంలో వైఎస్ భాస్కరరెడ్డి తన రెండు ఫోన్లు స్విచాఫ్ చేశార... అదేరోజు సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేకాను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారని సీబీఐ తెలిపింది. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు వరకూ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంటికి సునీల్ యాదవ్ పదే పదే తిరిగారని సీబీఐ నిగ్గుతేల్చింది. ఈ కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డిని ప్రధాన పాత్రధారిగా గుర్తించి ఆదివారం అరెస్టు చేసింది.
హత్య తరువాత.. అక్కడే నిరీక్షణ: 2019 మార్చి 15 ఉదయం నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి... వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంటివద్దే ఉన్నారని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్య ప్రణాళిక అమలు పూర్తయిన విషయం వారికి అప్పటికే తెలుసని... వేరే వ్యక్తుల ద్వారా వివేకా మృతి సమాచారాన్ని తెలుసుకోవాలని, ఆ తర్వాత వెంటనే అక్కడికి చేరుకుని ఆధారాలు, సాక్ష్యాలు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో అక్కడే నిరీక్షించారని రిపోర్టులో పేర్కొంది. వివేకా చనిపోయారనే విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి బయటికి చెప్పగానే... దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నట్లు వివరించింది.
అదే సమయంలో వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరారని సీబీఐ గుర్తించింది. హత్యాస్థలిలో ఆధారాల్ని చెరిపేయడంతో పాటు గుండెపోటుతో వివేకా చనిపోయినట్లు ప్రచారం చేయడం వరకు... అన్నీ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, గంగిరెడ్డి సమక్షంలోనే జరిగినట్లు సీబీఐ తెలిపింది. మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం, తలపై తీవ్రగాయాలు, గొడ్డలిపోటు ఉండటం చూసి కూడా... ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారని గుర్తుచేసింది. గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే అంశంపై అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి మధ్య అంతకుముందు చర్చ జరిగిందని... అందుకు అనుగుణంగానే గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారని సీబీఐ తేల్చింది.
గుండెపోటుగా చిత్రీకరణ: 2019 మార్చి 15 ఉదయం 6 గంటల 32 నిమిషాల సమయంలో 90002-66234 ఫోన్ నెంబరుకు అవినాష్‌రెడ్డి కాల్ చేసిన విషయం ప్రస్తావించింది. ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతితో మాట్లాడాలంటే ఈ నంబరుకే కాల్ చేయాల్సి ఉంటుందని, అది ఆమె వ్యక్తిగత సహాయకుడు నవీన్ వద్ద ఉండే ఫోన్ నెంబర్ అని గుర్తించిన సీబీఐ.... ఆయన్ను కూడా ఇటీవల ప్రశ్నించింది. 6 గంటల 40 నిమిషాలకు ఓసారి, 6 గంటల 41 నిమిషాలకు మరోసారి... అదే నెంబర్‌కు అవినాష్‌రెడ్డి కాల్ చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఆయన పీఏ రాఘవరెడ్డి ఫోన్ నుంచి అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి... గుండెపోటు, రక్తపు వాంతులతో వివేకా చనిపోయినట్లు చెప్పారని, బందోబస్తు కోసం సిబ్బందిని పంపించమన్నారని సీబీఐ పేర్కొంది.