తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివేకా మృతి విషయం జగన్​కు ముందే తెలుసు.. అవినాష్​ రెడ్డే చెప్పారా..?: సీబీఐ - CBI Counter Petition in Viveka Case

CBI Counter Petition in Viveka Case: మాజీమంత్రి వివేకా హత్యకేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పేరే వినిపించగా.. తొలిసారి ముఖ్యమంత్రి జగన్ పేరు సీబీఐ నోట వినిపించింది. బాబాయి హత్య వార్త జగన్‌కు ముందే తెలుసు అంటూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ అదనపు కౌంటర్ దాఖలు చేసింది. హత్య జరిగిన రోజు ఉదయం 6.15 గంటల కన్నా ముందే ఆయనకు సమాచారం వచ్చిందని ...దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపింది.

YS JAGAN
వైఎస్ జగన్

By

Published : May 26, 2023, 7:37 PM IST

Updated : May 27, 2023, 6:36 AM IST

CBI Counter Petition in Viveka Case: వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే సీఎం జగన్‌కు సమాచారం అందిందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది. హత్య జరిగిన రోజు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఉదయం 6.15 గంటలకు అందరికీ తెలియజేశారని.. కానీ అంతకు ముందే ఈ విషయం జగన్‌కు తెలుసని సీబీఐ పేర్కొంది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ ఐపీడీఆర్​ ద్వారా పరిశీలిస్తే హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4.11 గంటలకు వాట్సాప్‌లో చురుగ్గా ఉన్నారని.. జగన్‌కు వివేకా హత్య గురించి సమాచారం అందించడంలో అవినాష్ పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపింది.

వివేకా హత్య అనంతరం అర్థరాత్రి 1.58కి సునీల్‌యాదవ్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉండటం... దీంతోపాటు అవినాష్‌ వాట్సప్ వాయిస్‌ కాల్‌లో ఉండటం వంటి అంశాల దృష్ట్యా ఆయన్ను పోలీసు కష్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరినా...అవినాష్‌రెడ్డి సహకరించకపోవడం వల్లే అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ బృందం కర్నూలు వెళ్లిందని తెలిపింది.

అవినాష్‌ అనుచరులు అ్డడుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఎస్పీ సాయాన్ని కోరామంటూ.. అవినాష్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని.. దర్యాప్తును సత్వరం పూర్తి చేయడానికి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గతంలో సరైన సమాధానాలు చెప్పకుండా దర్యాప్తునకు సహకరించలేదన్నారు. హత్య వెనుక కుట్రను ఛేదించడానికి ఆయన ముందుకు రావడంలేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ అవసరమని ఇంతకుముందు కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపింది.

అవినాష్‌రెడ్డి మొబైల్‌ ఫోన్‌ను I.P.D.R. ద్వారా పరిశీలిస్తే వివేకానందరెడ్డి హత్యకు ముందు 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి దాటాక 12 గంటల 27 నిమిషాల నుంచి ఒంటిగంట 10 నిమిషాల వరకు వాట్సప్‌ యాక్టివ్‌గా ఉండటమేగాక.. వాట్సప్‌ కాల్స్‌ కూడా చేశారని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. వివేకానందరెడ్డి హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు ఆ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో వివేకా ఇంట్లోకి చొరబడినట్లు పేర్కొంది. అంతేగాకుండా వివేకా హత్య అనంతరం రెండో నిందితుడైన సునీల్‌యాదవ్‌ ఆరోజు రాత్రి 1.58 గంటలకు అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ సూచించిందని తెలిపింది. 15వ తేదీ తెల్లవారుజామున 4.11 గంటలకు అవినాష్‌రెడ్డి వాట్సప్‌ ద్వారా మాట్లాడినట్లు I.P.D.R. పరిశీలనలో తేలిందని సీబీఐ వివరించింది.

వివిధ కారణాలు చెబుతూ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావడం లేదని సీబీఐ తెలిపింది. ఈ నెల 16న విచారణకు పిలిస్తే.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ 4 రోజులు గడువు కోరారన్నారు. 19న రావాలని నోటీసులిస్తే.. తల్లి ఆరోగ్యం బాగోలేదని, కుదుటపడిన తరవాత హాజరవుతానని చెప్పినట్లు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 19న హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన.. తల్లి అనారోగ్యం సాకుతో దర్యాప్తునకు రాకుండానే హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోయారని తెలిపింది. పులివెందుల వెళ్తున్నారని తెలిసి.. తాము కడప ఎస్పీని సాయం కోరగా.. అవినాష్‌ పులివెందుల రాకుండా కర్నూలు వెళ్లిపోయారని తెలింపింది.

మరోసారి నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరితే.. తల్లిని చూసుకోవాల్సి ఉందని 7 రోజులపాటు రాలేనంటూ సమాచారమిచ్చారని హైకోర్టు వివరించింది. అందుకే ఈనెల 22న అవినాష్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ బృందం కర్నూలు వెళ్లిందని.. అక్కడ ఆయన అనుచరులు దారులన్నీ మూసివేసి అడ్డగించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ఆందోళనతో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు కర్నూలు ఎస్పీ సాయం కోరినట్లు తెలిపింది. జూన్‌ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని.. అయినా అవినాష్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా విచారణకు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొంది. ఈ కారణాల నేపథ్యంలో ముందస్తు బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ కోరింది. బెయిలు పిటిషన్‌ను కొట్టివేస్తే జూన్‌ 30లోగా దర్యాప్తు పూర్తి చేయడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : May 27, 2023, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details