తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CBI Counter on Ajeya Kallam Statement అజేయకల్లం వి.. నేర న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించే యత్నాలు: తెలంగాణ హైకోర్టుకు సీల్డ్​కవర్ అందజేసిన​ సీబీఐ - అజేయ కల్లం వాంగ్మూలం ఉపసంహరణపై విచారణ

CBI Counter on Ajeya Kallam Statement Withdrawal: వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న మాజీ ఐఏఎస్​ అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం వాంగ్మూలం ఉపసంహరణ అంశంలో.. సీబీఐ కౌంటర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒత్తిడితోనే ఆయన మాట మార్చారని సీబీఐ న్యాయస్థానానికి వివరించింది. ఆయన చెప్పింది చెప్పినట్లే రికార్డు చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

CBI_Counter_on_Ajeya_Kallam_Statement_Withdrawal
CBI_Counter_on_Ajeya_Kallam_Statement_Withdrawal

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 10:19 AM IST

Updated : Sep 17, 2023, 12:32 PM IST

CBI Counter on Ajeya Kallam Statement Withdrawal: వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లంపై తీవ్ర ఒత్తిడి ఉందని సీబీఐ తెలిపింది. అందుకే ఆయన మాటమార్చారని ఆరోపించింది. తన వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించిందని.. దాన్ని రికార్డుల నుంచి తొలగించాలన్న కల్లం ఆరోపణతో ఆయన వాంగ్మూలం రికార్డును తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. సీఎస్‌గా పనిచేసిన వ్యక్తే ఎదురుతిరిగితే.. సామాన్య సాక్షుల పరిస్థితి ఏంటని సీబీఐ ప్రశ్నించింది. ఇది ఇతర సాక్షులను ప్రభావితం చేయాలన్న ఎత్తుగడలో భాగమేనని ఆరోపించింది.

వివేకా హత్య కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న మాజీ ఐఏఎస్​ అధికారి, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం వాంగ్మూలం ఆడియో రికార్డును సీబీఐ తెలంగాణ హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. తన వాంగ్మూలాన్ని వక్రీకరించి.. సీబీఐ కింది కోర్టుకు సమర్పించిందని. దాన్ని రికార్డుల నుంచి తొలగించాలన్న అజేయ కల్లం ఆరోపణల నేపథ్యంలో ఆడియో రికార్డును హైకోర్టుకు సీబీఐ సమర్పించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 29న అజేయ కల్లం వాంగ్మూలాన్ని నమోదు చేయగా ఇంత ఆలస్యంగా దాన్ని ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారంటే ఆయనపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సీబీఐ వెల్లడించింది. ఆయన చెబుతుంటే దర్యాప్తు అధికారి టైప్ చేశారని.. తర్వాత ఆయన దాన్ని పరిశీలించి, మార్పులు చేర్పులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారని సీబీఐ తెలిపింది. తనపై ఒత్తిడి రావడంతో ఆ తర్వాత వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన చెప్పారని సీబీఐ ఆరోపించింది. ఈ స్థాయి సాక్షి ఎదురుతిరిగితే ఇతర సాక్షుల ఆలోచనలపై ప్రభావం చూపుతుంది సీబీఐ తెలిపింది.

CBI Counter on Petition of CM Jagan Advisor Ajeya Kallam: సీఎం జగన్‌ సలహాదారు అజేయ కల్లం తీరుపై సీబీఐ అసహనం

వాంగ్మూలాన్ని వక్రీకరించారని అజేయ కల్లం పిటిషన్ దాఖలు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని సీబీఐ పేర్కొంది. ఈ పిటిషన్ విచారణార్హం కాదని వాదించింది. ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అజేయ కల్లం ఇప్పుడూ, వాంగ్మూలం నమోదు చేసినప్పుడూ ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు. పిటిషన్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సీబీఐ అదనపు ఎస్పీ ముఖేష్ శర్మ, ఎస్పీ వికాస్‌ కుమార్ ఎదుట ఆయన ఇంట్లోనే నమోదు చేసిన వాంగ్మూలాన్ని ఇంత ఆలస్యంగా ఉపసంహరించుకుంటున్నారంటే ఆయనపై ఒత్తిడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సీబీఐ కౌంటర్‌లో పేర్కొంది.

ఏప్రిల్ 29న వాంగ్మూలం నమోదు చేయగా ఇప్పటి వరకు దర్యాప్తు అధికారిపై అజయ కల్లం ఫిర్యాదు చేయలేదంటే.. వాంగ్మూలానికి ఆయన అంగీకారం ఉన్నట్లు స్పష్టమవుతోందని తెలిపింది. మాజీ ఐఏఎస్​ అధికారిగా సీఆర్​పీసీ సెక్షన్ 161 కింద నమోదు చేసిన వాంగ్మూలం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసని.. చట్ట ప్రకారం వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారి రికార్డు చేసి, దాన్ని చదివి వివరిస్తారని పిటిషన్‌లో పేర్కొంది.

సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి తన వాంగ్మూలం విరుద్ధంగా ఉందని మే మూడోవారంలో పత్రికల్లో వచ్చిన తర్వాత మీడియా సమావేశం ద్వారా ఖండించాల్సి వచ్చిందని ఆరోపించారు. అయినా ఈ వాంగ్మూలంలో ఒక భాగాన్నే ఆయన తిరస్కరిస్తున్నారని సీబీఐ కౌంటర్ లో పేర్కొంది.

అజేయ కల్లం అనుమతితో దర్యాప్తు అధికారి చట్ట ప్రకారం వాంగ్మూలం నమోదు చేసినందున ఆయన వేసిన పిటిషన్ చెల్లదని సీబీఐ తెలిపింది. దర్యాప్తు అధికారిపైన, సీబీఐ పైన తప్పుడు ఆరోపణలు, అపోహలతో దాఖలు చేసినందున పిటిషన్ విచారణార్హం కాదని తెలిపింది. సీనియర్ అధికారిగా పనిచేసిన అజేయ కల్లం.. ఈ కేసులో దర్యాప్తు సంస్థ, న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత చూపాల్సింది పోయి నేర న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.

ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోలేకపోయాం: అజేయ కల్లం

సీఆర్​పీసీ సెక్షన్ 160 కింద సాక్షికి నోటీసు ఇచ్చి పిలిపించే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. 15 ఏళ్ల లోపువారిని, 60ఏళ్లు దాటినవారిని, మహిళలను పిలిపించకూడదు. వారి వద్దకే వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. అందుకే పిటిషనర్‌ను వాట్సప్, ఫోన్ ద్వారా సంప్రదించి ఆయనకు వీలైన సమయం, ప్రదేశం తెలుసుకుని వెళ్లి.. చెప్పినది చెప్పినట్లు అధికారులు రికార్డు చేశారని సీబీఐ తెలిపింది. ఇప్పుడు దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేస్తూ అజయ కల్లం ఉపసంహరించుకుంటున్నారని.. ఆయన ఆరోపణలన్నీ కల్పితమేనని సీబీఐ తెలిపింది.

చెప్పాలనుకున్నది చెప్పే హక్కు పిటిషనర్‌కు ఉందని సీబీఐ వివరించింది. అది విచారణ సమయంలో చెప్పాలని.. ఈ దశలో పిటిషన్ వేసి ఆరోపణలు చేయడం సరికాదని సీబీఐ మండిపడింది. ఇది వివేకా హత్య కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు, సీబీఐ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నమని ఆరోపించింది. వివేకా హత్యపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా దర్యాప్తు చేశామని.. నిర్దోషులను తప్పుగా ఇరికించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని తెలిపింది.

జూన్ 28న అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయడంతో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది. ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ప్రతి సాక్షి వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటే.. నేర న్యాయవ్యవస్థ అపహాస్యం పాలవుతుందని కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. సాక్షిగా మాజీ ఐఏఎస్ స్థాయి అధికారి వ్యక్తి విచారణ ప్రారంభం కాకముందే ఎదురుతిరిగితే సాధారణ సాక్షులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను భారీ జరిమానా విధిస్తూ కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ అభ్యర్థించింది.

CBI Counter on Ajeya Kallam Statement నేర న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించే యత్నాలు
Last Updated : Sep 17, 2023, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details