మాదక ద్రవ్యాల వినియోగం కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను తప్పించేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారన్న ఆరోపణలపై మాజీ ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే సహా మరో నలుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం గోరెగావ్‌లోని సమీర్ వాంఖడే నివాసంపై సీబీఐ అధికారులు.. శుక్రవారం సోదాలు నిర్వహించారు. ముంబయి, దిల్లీ, రాంచీ, కాన్పూర్ సహా 29 ప్రాంతాల్లో సమీర్, మరో నలుగురికి సంబంధించిన నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు సమీర్ వాంఖడే, ఆయన సహచరులు రూ. 50 లక్షలు అడ్వాన్స్ తీసుకొన్నట్లు సమాచారం వచ్చిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ కేసు..
2021 అక్టోబర్ 2న ముంబయి తీరప్రాంతంలో క్రూజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ ఘటనలో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. 25 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో కొన్నాళ్ల తర్వాత ఆర్యన్‌కు క్లీన్ చిట్ లభించింది. దీంతో అప్పటి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే అనేక ఆరోపణలు కూడా వచ్చాయి.