తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెన్సీ నోట్ల భద్రత పోగు సరఫరాలో అవినీతి!.. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిపై CBI కేసు - అరవింద్ మాయారంపై అవినీతి ఆరోపణలు

కరెన్సీ నోట్ల ముద్రణలో ఉపయోగించే 'ఆకుపచ్చ రంగు భద్రత పోగు’ సరఫరాలో అవినీతి ఆరోపణలున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారాంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లకు అవసరమైన ప్రత్యేక ఆకుపచ్చ రంగు భద్రత పోగు సరఫరా కాంట్రాక్టును ఓ బ్రిటన్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేలా పొడిగించడంలో అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ.

ex finance secretary Arvind Mayaram
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారాం

By

Published : Jan 13, 2023, 7:59 AM IST

Updated : Jan 13, 2023, 8:10 AM IST

కరెన్సీ నోట్ల ముద్రణలో ఉపయోగించే 'ఆకుపచ్చ రంగు భద్రత పోగు' సరఫరాలో అవినీతి ఆరోపణలున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారాంపై సీబీఐ గురువారం కేసు నమోదు చేసింది. అంతకుముందు జైపుర్‌, దిల్లీల్లోని ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ముద్రించే కరెన్సీ నోట్లకు అవసరమైన ప్రత్యేక ఆకుపచ్చ రంగు భద్రత పోగు సరఫరా కాంట్రాక్టును ఓ బ్రిటన్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేలా పొడిగించడంలో అవినీతి చోటుచేసుకుందనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో అరవింద్‌ మాయారాం, బ్రిటన్‌కు చెందిన 'దె ల రూ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌', ఆర్బీఐతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని గుర్తుతెలియని వ్యక్తులు కుట్రకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.

ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో మాయారాం.. అక్రమ పద్ధతిలో, హోంమంత్రిత్వ శాఖ పూర్వానుమతి తీసుకోకుండా, భద్రతాపరమైన అనుమతుల్లేకుండా సరఫరా కాంట్రాక్టును పొడిగించారని ఆరోపించింది. భారతీయ శిక్షాస్మృతిలోని నేరపూరిత కుట్ర, మోసం సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారమంతా 2004 నుంచి 2013 వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. 1978 బ్యాచ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన అరవింద్‌ మాయారాం ప్రస్తుతం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న కొద్ది రోజుల వ్యవధిలోనే అరవింద్‌ నివాసాల్లో సోదాలు జరగడం, కేసులు నమోదు కావడం విశేషం.

ఎప్పుడు, ఎలా జరిగింది?
కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలోని చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ఫిర్యాదుతో 2018లో ప్రాథమిక దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దానిలో తేలిన అంశాల ఆధారంగా రెగ్యులర్‌ కేసుగా మార్చింది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. కరెన్సీ నోట్లపై వినియోగించే ప్రత్యేక ఆకుపచ్చ రంగు పోగు సరఫరా కోసం తొలుత అయిదు సంవత్సరాల కోసం 'దె ల రూ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌'తో 2004లో కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి 2015 డిసెంబరు 31 వరకు నాలుగు సార్లు ఆ ఒప్పందాన్ని పొడిగించారు.

  • భారతీయ కరెన్సీ అవసరాల కోసం ప్రత్యేక రంగు పోగును తాము అభివృద్ధి పరిచినట్లు ‘దె ల రూ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’ ఒప్పంద సమయంలో పేర్కొంది. ప్రత్యేక తయారీ హక్కులు తమకు ఉన్నట్లు పేర్కొంది.
  • భారత్‌లో ఆ పేటెంట్‌ కోసం బ్రిటన్‌ కంపెనీ 2004 జూన్‌ 28న దరఖాస్తు చేసుకుంది. 2011 జూన్‌ 17న పేటెంట్‌ మంజూరైంది. అంటే అప్పటి వరకూ ఆ సంస్థకు పేటెంట్‌ లేదని సీబీఐ తెలిపింది.
  • 2002 నుంచి సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నా పేటెంట్‌ను తనిఖీ చేయకుండానే 2004లో అప్పటి ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.కె.బిశ్వాస్‌ ప్రత్యేక ఒప్పందంపై సంతకం చేశారు. కాంట్రాక్టును ఆ సంస్థకే పొడిగించాలనే నిబంధన ఒప్పందంలో లేదు.
  • బ్రిటన్‌ సంస్థ పేటెంట్‌ను కలిగిలేదనే విషయాన్ని తెలియజేస్తూ 2006 ఏప్రిల్‌ 17న, 2007 సెప్టెంబరు 20న ఆర్బీఐ, భారతీయ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌లు నివేదికలు సమర్పించాయి.
  • ఆ విషయాలను అరవింద్‌ మాయారాం ఎన్నడూ ఆర్థిక మంత్రికి వివరించలేదు.
  • అయినప్పటికీ 2012 డిసెంబరు 31న కూడా భద్రత పోగు సరఫరా కాంట్రాక్టును ఆ సంస్థకు పొడిగించారు. 2013 జూన్‌ 23న మరో మూడేళ్లకు కాంట్రాక్టును పొడిగిస్తూ మాయారాం అనుమతి మంజూరు చేశారు. అప్పుడు కూడా హోంమంత్రిత్వ శాఖ పూర్వానుమతి పొందలేదు.
  • 'దె ల రూ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌' తరఫున ఒప్పందంపై సంతకం చేసిన అనిల్‌ రఘ్బీర్‌...తమ సంస్థ నుంచి 2011లో తగిన ప్రతిఫలం పొందడంతో పాటు ఓ విదేశీ సంస్థ నుంచి రూ.8.2 కోట్లు అందుకున్నట్లు సీబీఐ ఆరోపించింది.
  • ఇవీ చదవండి:
  • కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
  • సెలవులు ఇవ్వని ఉన్నతాధికారులు.. రెండేళ్ల కొడుకు మృతి.. శవాన్ని భుజాన మోస్తూ స్టేషన్​కు..
Last Updated : Jan 13, 2023, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details