జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు (Submarine Data Leaked) నావికా దళానికి చెందిన ప్రస్తుత అధికారి, ఇద్దరు మాజీ అధికారులను సీబీఐ (CBI News) అరెస్టు చేసింది. ప్రస్తుతం ముంబయిలో పనిచేస్తున్న కమాండర్ స్థాయి అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కిలో క్లాస్ సబ్మెరైన్ ఆధునికీకరణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నేవీ కమాండర్.. విశ్రాంత ఉద్యోగులకు రహస్యంగా చేరవేశారని వెల్లడించాయి. అరెస్టైన వారితో సంబంధాలు ఉన్న నేవీ ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోందని ఆయా వర్గాలు చెప్పాయి. విచారణకు నావికా దళం నుంచి పూర్తి సహకారం ఉందని తెలిపాయి.
మరోవైపు, నావికాదళం (Indian Navy news) సైతం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని వీరిని ఆదేశించినట్లు వెల్లడించాయి.