CBI Arrests Bhola Yadav: యూపీఏ హయాంలో రైల్వే స్కాంకు సంబంధించి.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనుచరుడు భోళా యాదవ్‌ను అరెస్టు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం.
భోళా యాదవ్‌ను రాష్ట్రీయ జనతాదళ్ మద్దతుదారులు.. హనుమాన్, లాలూ నీడగా పిలుస్తుంటారు. ఉద్యోగార్థులకు రైల్వే గ్రూప్-డి జాబ్స్ ఇప్పించి.. భూముల్ని లాలూ కుటుంబానికి బదిలీ చేయడంలో భోళా యాదవ్ కీలకంగా వ్యవహరించారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పట్నా, దర్భంగలోని ఆయనకు చెందిన ప్రదేశాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. అనంతరం అరెస్టు చేసింది.
ఈ స్కాం జరిగిన సమయంలో లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. భోళా యాదవ్ అప్పట్లో లాలూకు ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేసి బహదూర్పుర్ సీటు గెల్చుకున్నారు. 2020లో భోళా యాదవ్.. వేరే చోటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అందులో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు రాగా సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్ సహా మరో 12 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చింది.
ఉద్యోగార్థుల కుటుంబాల నుంచి దాదాపు లక్ష చదరపు అడుగుల భూముల్ని లాలూ కుటుంబం అక్రమంగా పొందిందని అభియోగాలు మోపింది సీబీఐ.