Manipur Students Death : మణిపుర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఇంఫాల్‌కు 51 కిలోమీటర్ల దూరంలోని చురాచంద్‌పుర్ జిల్లాలో ఇద్దరు బాలికలు సహా నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా అరెస్టైన నలుగురిని వెంటనే అసోంలోని గువాహటికి తరలించామని తెలిపారు. నిందితుల్లో ఒకరిని వారి పిల్లలతో సహా అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆ పిల్లలను వారి బంధువులకు అప్పగించే అవకాశం ఉందన్నారు. మణిపుర్ పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌కు రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెబామ్ నేతృత్వం వహించారు. గతంలో ఆయన '21 పారా'లో పని చేశారు. ఇటీవలే ఆయన సీనియర్ ఎస్పీ(కొంబాట్)గా నియమితులయ్యారు. జులైలో కనిపించకుండా పోయిన మైనర్ విద్యార్థుల(ఓ యువతి, ఓ యువకుడు) మృతదేహాల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే అరెస్టు సమాచారం తెలిసి కొన్ని అల్లరి మూకలు ఎయిర్‌పోర్టు దిశగా దూసుకెళ్లినట్లు సమాచారం.
నేరం చేసినవారు తప్పించుకోలేరు : సీఎం
Manipur Violence : మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్లు మణిపుర్ సీఎం బీరేన్ సింగ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేరం చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని.. క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.