Cat Suspicious death complaint to Police: చూడముచ్చట గొలిపే తెల్లని పర్షియన్ జాతి పిల్లి అది. పుట్టిన రోజు బహుమతిగా తమ ఇంటికి రావడంతో దానికంటూ ప్రత్యేకంగా ఆహారం కూడా పెడుతూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు యజమానులు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అప్పటికేకనిపించకుండా పోయిన ఆ పిల్లి వీధిలో చనిపోయి కనిపించింది. దీంతో దాని యజమాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పక్కింటి వారే తమ పిల్లిని చంపేసి ఉండొచ్చని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోడ్డుపై మృతదేహం..: అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లిని.. ఇంటి ఆవరణలోకి వస్తుందని పక్కింటి వారు చంపారంటూ పెంపకందారురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు తన మేనల్లుడు గత మార్చి నెలలో పుట్టిన రోజు సందర్భంగా పర్షియన్ జాతి పిల్లిని బహుమతిగా ఇచ్చాడు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లి..ఇటీవల పక్కింటి ఆవరణలోని చెట్ల చల్లదనానికి అలవాటు పడింది. తమ పిల్లి ఈనెల 28వ తేదీ తెల్లవారుజము నుంచి కనిపించడం లేదని యజమాని చానా తెలిపారు. కాగా తమ ఇంటి పరిసరాల్లో గాలించగా రోడ్డుపై మృతదేహం కనిపించింది. పిల్లి మృతికి పక్కింటి కుమారి కారణమని ఆరోపిస్తూ పిల్లి యజమాని చానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 429 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.