Caste discrimination: దేశం వివిధ రంగాల్లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంటున్నా... కుల జాడ్యాన్ని మాత్రం వదిలించుకోలేకోపోతోంది. కులం కారణంగా అణగారినవర్గాల వారు నిత్యం అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ తరహా వివక్ష పెద్దల్లోనే కాదు.. పిల్లల్లోనూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లో ఓ హేయమైన ఘటన వెలుగు చూసింది. దళితురాలు అన్న కారణంతో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళను ఉద్యోగం నుంచి అధికారులు తొలిగించినట్లు తెలుస్తోంది. ఆ పాఠశాలలో చదివే అగ్రకులాల విద్యార్థులు ఆమె వండిన భోజనాన్ని తినేందుకు నిరాకరించగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
టిఫిన్ బాక్సులు తెచ్చుకుని...
Dalit cook in school: చంపావత్ జిల్లా సూఖీడాంగ్ గ్రామంలోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఈ నెల ప్రారంభంలో దళిత మహిళను 'భోజనమాత'గా(వంట చేసే మహిళ) నియమించారు. అయితే.. ఆమె దళితురాలు అన్న కారణంతో ఆ పాఠశాలలోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం మానేశారు. ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుని తినడం ప్రారంభించారు. మొత్తం 66 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 40 మంది సదరు మహిళ చేతి వంటను తినేందుకు నిరాకరించారని సమాచారం. అంతేకాదు ఆమెను 'భోజనమాత'గా నియమించడంపై అగ్రవర్ణాల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అభ్యంతరం తెలిపారు. ఈ ఉద్యోగం కోసం అగ్రవర్ణానికి చెందిన మరో మహిళ కూడా ఇంటర్వ్యూ కోసం రాగా దళిత మహిళను అధికారులు ఎంపిక చేయడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.