CASTE DISCRIMINATION: ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లా సూఖీడాంగ్ గ్రామంలోని పాఠశాల యాజమాన్యానికి వచ్చిన సమస్యకు పరిష్కారం చూపారు అధికారులు. స్థానికంగా ఉండే ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని దళిత మహిళ వండుతోందని.. అక్కడి విద్యార్థులు అన్నం తినేందుకు నిరాకరించారు. ఆమెను విధుల్లో నుంచి తొలగించి అగ్రవర్ణాలకు చెందిన వంట మనిషిని నియమించారు. అయితే, ఇక్కడ మరో సమస్య ఎదురైంది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు.. అగ్రకులానికి చెందిన మహిళ వండే ఆహారాన్ని తినడానికి నిరాకరించారు.
పాఠశాలలో 6 నుంచి 8 తరగతుల వరకు 58 మంది విద్యార్థులు ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్న భోజనానికి పిల్లలందరినీ పిలిచారు. ఈ క్రమంలో వారిలో ఉండే 23 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు భోజనం చేయడానికి నిరాకరించారు. ఈ అన్నం వండింది అగ్రవర్ణాలకు చెందిన మహిళ కావున తాము తినమని స్పష్టం చేశారు.