కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన ప్రతిసారి మతాధిపతులు, మఠాధిపతులు, సామాజిక వర్గాల పెద్దలకు వీవీఐపీ గౌరవాలు లభిస్తాయి. ప్రాంతీయ సామాజిక వర్గాల నేతలు, మతాధికారులను కలిసేందుకు రాజకీయ వర్గాలు క్యూ కడతాయి. ఎన్నికలు జరిగే ప్రతిసారి ఈ తంతు అక్కడ సాధారణమైపోయింది. ఈసారి సీఎం పినరయి విజయనే ఈ క్రతువును ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వెంటనే.. మత పెద్దలు, కుల సంఘాలతో భేటీ అయ్యారు. ప్రణాళిక ప్రకారం ఒక్కో జిల్లాలో పర్యటించారు. వెంటనే యూడీఎఫ్(యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) సైతం అప్రమత్తమై.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహించింది. ఇవన్నీ గమనించిన భాజపా.. తానేం తక్కువ కాదంటూ వీరిని అనుసరిస్తూ రంగంలోకి దిగింది. క్రైస్తవులను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి:కేరళలో ఇప్పుడైనా భాజపా పుంజుకుంటుందా?
కేరళలో ప్రస్తుతం మూడు కూటముల మధ్య పోటీ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. మత పెద్దలు, సామాజిక వర్గాలను సంతృప్తిపరిచేలా రాజకీయ వర్గాలు నడుచుకుంటున్న నేపథ్యంలో.. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు వరకు ప్రతి అంశం సామాజిక సమీకరణాల ఆధారంగానే ఉంటుందని స్పష్టమవుతోంది.
సామాజిక సమీకరణాలు ఇలా..
2011 లెక్కల ప్రకారం కేరళ జనాభా 3.34 కోట్లు. ఇందులో 54.73 శాతం హిందువులు, 26.56 శాతం ముస్లింలు, 18.38 శాతం క్రైస్తవులు ఉన్నారు. హిందువుల్లో ఎఝావా, నాయర్ సామాజిక వర్గాలు ప్రధానమైనవి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ఎఝావాలు 27 శాతంగా ఉన్నారు. వెల్లప్పల్లి నదేశన్ నేతృత్వంలోని శ్రీనారాయణ ధర్మ పరిపాలనా యోగం(ఎస్ఎన్డీపీ) సంస్థ ఎఝావాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అలప్పుజలో ఉన్న ఈ సంస్థ.. దాదాపు 50 నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, త్రిస్సూర్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి:కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్' పైనే!
ఇటీవల సీపీఎం పార్టీకే ఎస్ఎన్డీపీ మద్దతు ఇచ్చింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం సహా కీలకమైన అంశాలపై సర్కారుకు అండగా నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్ఎన్డీపీ మద్దతు ఉన్నప్పటికీ.. అధికార ఎల్డీఎఫ్ సత్తా చాటలేకపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 నియోజకవర్గాలను గెలుచుకుంది. శబరిమలపై విజయన్ సర్కారు వైఖరి, భాజపాకు వ్యతిరేకంగా మైనారిటీల ఏకీకరణ సహా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచే పోటీ చేయడం యూడీఎఫ్‌కు కలిసొచ్చాయి. అయితే, ఆ తర్వాత ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పక్షం పుంజుకుంది. ఎస్ఎన్డీపీ మద్దతుతో యూడీఎఫ్ సిట్టింగ్ స్థానాల్లోని రెండింటిని గెలుచుకుంది.
ఎన్ఎస్ఎస్.. మరో నిర్ణయాత్మక శక్తి!
కేరళ జనాభాలో 17 శాతంగా ఉన్న నాయర్లు సైతం ఇక్కడి ఎన్నికల్లో కీలకం. నాయర్ సర్వీస్ సొసైటీ(ఎన్ఎస్ఎస్)కు చెందిన నేషనల్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) ఇదివరకు యూడీఎఫ్‌లో భాగంగా ఉండేది. 1986 తర్వాత ఈ పార్టీ రద్దైంది. ఆ తర్వాత యూడీఎఫ్‌కు మద్దతిచ్చిన ఎన్ఎస్ఎస్.. 1995 నుంచి అన్ని రాజకీయ పార్టీలకు సమదూరం పాటిస్తూ వస్తోంది నాయర్ సర్వీస్ సొసైటీ. అయితే ఈ సమదూరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఎన్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తున్నాయి.
ఇదీ చదవండి:కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?
తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, పతానంతిట్ట, కొట్టాయం, త్రిస్సూర్, పాలక్కడ్ జిల్లాల్లో నాయర్ సామాజిక వర్గానికి బలమైన పట్టు ఉంది. శబరిమల ఆలయానికి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలుత రోడ్డెక్కి నిరసనలు చేసింది నాయర్ సర్వీస్ సొసైటీనే. భాజపా సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టినప్పటికీ.. ఆ పార్టీతో ఎప్పుడూ వేదిక పంచుకోలేదు. కేరళ వచ్చినప్పుడల్లా ఎన్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని అమిత్ షా ప్రయత్నించారు. అయితే ఎన్ఎస్ఎస్ నాయకులు మాత్రం ఇందుకు ఆసక్తి కనబర్చలేదు. లౌకికవాదులుగా తమకు ఉన్న పేరును పోగొట్టుకోవడానికి ఎన్ఎస్ఎస్ సిద్ధంగా లేదు. కాబట్టి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఈ సామాజిక వర్గం మద్దతు కోసం శ్రమిస్తున్నాయి.
క్రైస్తవులతో యూడీఎఫ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలిన యూడీఎఫ్.. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. మత పెద్దలు, కుల పెద్దలతో సమావేశమవుతోంది. క్రైస్తవులతో బలమైన సంబంధాలు కలిగి ఉన్న మాజీ సీఎం ఉమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ బృందం ఈ సామాజిక వర్గం ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సైరో మలాంకరా క్యాథలిక్ చర్చిల హెడ్ 'కార్డినల్ మార్ క్లిమ్మీస్ క్యాథలిక్ బవా'ను కలిశారు. క్రైస్తవుల మద్దతు తమకు దక్కేలా చూడాలని కోరారు. కేరళలోని మెజారిటీ క్రైస్తవులకు ఈ చర్చీలు ప్రాతినిధ్యం వహిస్తాయి. సెంట్రల్ ట్రావెన్కోర్, కొట్టాయం, పతానంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో వీరికి ఫలితాలను తారుమారు చేసే సత్తా ఉంది.
ఇదీ చదవండి:కాంగ్రెస్ 'శబరిమల వ్యూహం' ఫలిస్తుందా?
కన్నూర్, ఎర్నాకులం, వయనాడ్, త్రిస్సూర్ జిల్లాల్లో అధిక ప్రాబల్యం ఉన్న సైరో మలబార్ క్యాథలిక్ చర్చి అధిపతిని సైతం యూడీఎఫ్ నేతలు కలిశారు. ఈ సామాజిక వర్గం ప్రజలు యూడీఎఫ్ కూటమికే సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అయితే 2020 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్కు మద్దతు ఇచ్చారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ చర్చీల మద్దతు ఉన్న కాంగ్రెస్ నేత జోస్ కే మణి.. యూడీఎఫ్ నుంచి విడిపోయి.. వామపక్ష కూటమితో జట్టుకట్టడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సంప్రదాయ ఓటర్లు దూరమైతే కనీసం 30 నియోజకవర్గాల్లో ప్రతికూలంగా మారుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.
ముస్లింలు