తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుల'వరమా.. కలవరమా?.. బిహార్‌లో నీతీశ్‌ ప్రయోగం ప్రభావమెంత?

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌...రాబోయే లోక్‌సభ ఎన్నికలలోపు దేశంలో రాజకీయ షాక్‌లకు తెరలేపారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టారు. రెండు విడతలుగా ఈ కులగణన జరుగుతుంది. అయితే ఇది కులాలకు వరమా? కలవరమా?

caste-census-and-digital-census-first-time-in-bihar
బిహార్​లో రాష్ట్రంలో మొదటి సారి కులగణన

By

Published : Jan 8, 2023, 6:53 AM IST

ఇంజినీరింగ్‌ చదివి, విద్యుత్‌శాఖలో ఉద్యోగం చేసిన బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌...రాబోయే లోక్‌సభ ఎన్నికలలోపు దేశంలో రాజకీయ షాక్‌లకు తెరలేపారు. కేంద్రం కుదరదన్నా... తొలిసారి తమ రాష్ట్రంలో కులగణన మొదలెట్టి రాజకీయ తేనెతుట్టెను కదిపేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది కులాలకు వరమవుతుందా? లేక కలవరం సృష్టిస్తుందా అనేది చూడాలి!

1931 గీటురాయిగా..
పరాయి దేశమైన భారత్‌లో తన పాలనను స్థిర పరచుకోవటానికి, విభిన్న వర్గాలుగా ఉన్న ప్రజలను అర్థం చేసుకోవటానికి బ్రిటిష్‌ సర్కారు 1870ల్లో జనగణన మొదలెట్టింది. అప్పుడే కులగణన కూడా చేశారు. వాటి ఆధారంగానే దేశంలో కులాలకు ప్రాధాన్యతా క్రమాలను కూడా నిర్ధారించారు. అనేక కులాలు తమను అగ్రకులాలుగా గుర్తించాలంటూ అప్పట్లో బ్రిటిష్‌ సర్కారుకు అర్జీలు పెట్టుకున్నాయి కూడా! మొత్తానికి... దేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్‌ సర్కారు హయాంలో 1931లో చివరిసారిగా కులగణన చేశారు.

అప్పటి జనాభా గణాంకాల ఆధారంగానే స్వాతంత్య్రానంతరం దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత 1990ల్లో కేంద్రంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ (జనతాదళ్‌) ప్రభుత్వం ఓబీసీలకూ రిజర్వేషన్లను విస్తరించింది. దీనికి సరైన జనాభా ప్రాతిపదిక ఏమీ లేదు. ఒకవేళ 1931నాటి గణాంకాలనే తీసుకుంటే నాటి జనాభాలో ఓబీసీల సంఖ్య 52 శాతం! కానీ ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 27శాతం!

స్వాతంత్య్రం వచ్చాక కులగణనకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. కులాలతో పెట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లే అవుతుందనే ఉద్దేశంతో దానికి దూరంగా ఉంటూ వచ్చారు. జనాభాకు అనుగుణంగా తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఓబీసీల నుంచి డిమాండ్‌ మొదలైంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2011లో మాత్రం యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక, కులగణన చేయించారు. కానీ అందులో లభించిన కులాల గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆ తర్వాత భాజపా ప్రభుత్వం వచ్చాక కూడా కులగణన చేయాలనే డిమాండ్లు పెరిగాయి. కానీ కేంద్రం ఆ డిమాండ్‌ను తోసిపుచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు తప్ప మరే ఇతర కులాల గణన చేపట్టట్లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి 2021లో లోక్‌సభలో స్పష్టం చేశారు.

మరి బిహార్‌లో ఎందుకు?
కుల సమీకరణాలతో ముడిపడ్డ బిహార్‌లో ఓబీసీలది కీలక పాత్ర! బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తారు. కులగణన చేపట్టాలంటూ 2018, 2019ల్లో బిహార్‌ అసెంబ్లీలో ఏకగీవ్ర తీర్మానం ఆమోదింపజేశారు కూడా. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా... తమ రాష్ట్రంలో శనివారం నుంచి కులగణనకు శ్రీకారం చుట్టారు.

దేశానికి ప్రయోజనమే: నీతీశ్‌
బిహార్‌ వ్యాప్తంగా శనివారం మొదలైన ఈ కులగణన రెండు విడతలుగా జరుగుతుంది. మే నెలకల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. అంటే లోక్‌సభ ఎన్నికలకు ముందే లెక్కలతో నీతీశ్‌ కుమార్‌ ముందుకు వస్తారు. తద్వారా అన్ని రాష్ట్రాల్లోనూ కులగణన చేపట్టాలనే డిమాండ్‌ పెరుగుతుంది.

'రాష్ట్రంలో ఏయే కులస్థులెంతమంది ఉన్నారో, వారి ఆర్థిక స్థితిగతులేంటో ఈ గణనతో తెలుస్తాయి. అభివృద్ధిపథకాలను సరిగ్గా అందించటంలో ఈ లెక్కలు సాయపడతాయి. కులగణనలో మా రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. దేశానికి లాభం చేస్తుంది' అని నీతీశ్‌ వ్యాఖ్యానించటం గమనార్హం. బిహార్‌లో నీతీశ్‌ చేసే ప్రయోగం... దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం.

ABOUT THE AUTHOR

...view details