దిల్లీ శ్రధ్దావాకర్ తరహా ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. బుద్గామ్‌లో ఓ వ్యక్తి 30 ఏళ్ల మహిళను దారుణంగా చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు షబీర్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మార్చి 7న బాధితురాలు కోచింగ్ క్లాస్‌కు వెళ్లింది. ఆ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనిపించలేదు. మార్చి8న సోయిబగ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. షబీర్ అహ్మద్, అహ్మద్ అజీజ్, మరి కొందరు అనుమానితులను తమదైన రీతిలో విచారించారు. దీంతో షబీర్ అహ్మద్ తానే యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు.
'యువతిని మొహన్పొరలోని నా ఇంటికి తీసుకెళ్లా. మార్చి 7 అర్ధరాత్రి చంపేశా. హత్య విషయం బయటకు రాకూడదని యువతి తలను నరికేశా. అలాగే శరీర భాగాలను ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాను' అని పోలీసుల దర్యాప్తులో నిందితుడు షబీర్ అహ్మద్ ఒప్పుకున్నాడు. షబీర్‌ను తీసుకెళ్లి యువతి శరీర భాగాలను తీసుకొచ్చారు పోలీసులు. బాధితురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షబీర్ అహ్మద్(45) వృత్తిరీత్యా వడ్రంగి అని పోలీసులు తెలిపారు.