ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో వింత దొంగతనం జరిగింది. ఓ కారును దొంగిలించిన ముగ్గురు దొంగలు.. దానిని సుమారు 17 కిలోమీటర్ల మేర నెట్టుకుంటూ వెళ్లారు. దొంగిలించిన అనంతరం కారు స్టార్ట్ కాకపోవడం వల్ల అంత దూరం తోసుకుంటూనే వెళ్లారు దొంగలు. కారు యజమాని ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు దొంగలను పట్టుకోగా వీరిలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఇదీ జరిగింది
దబౌలి ప్రాంతానికి చెందిన సత్యం కుమార్, అమన్ బీటెక్ చదువుతున్నారు. వీరద్దరూ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్ ప్రమోషన్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీరికి అపార్ట్మెంట్లో పనిచేసే అమిత్‌తో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ఓ పాన్ షాప్ వద్ద కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి ముగ్గురి మధ్య స్నేహం పెరిగింది. తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని ఆశపడ్డారు. అందుకోసం వాహనాలను దొంగతనం చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మారుతీ కారును మే 22 తేదీ రాత్రి దొంగిలించేందుకు ప్రణాళిక రచించారు ముగ్గురు దొంగలు. అక్కడికి వెళ్లి కారును స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాకపోవడం వల్ల సుమారు 17 కిలోమీటర్ల మేర నెట్టుకుంటూనే వెళ్లారు. బాగా అలసిపోయిన దొంగలు.. కారును ఓ నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చి కారును గ్యారెజ్‌కు తీసుకెళ్లారు. కారు బాగయ్యాక దానిని వాడడం మొదలుపెట్టారు.