కర్ణాటక దావణగెరెలోని తుంగ కాలువలో ఓ కారు పడిన ఘటన కలకలం రేపింది. ఈ కారులో హొన్నల్లి భాజపా శాసనసభ్యుడు రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్(25) మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అక్టోబరు 30న చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు. మృతుడి తండ్రి రమేశ్.. తన కుమారుడు కనిపించట్లేదని మంగళవారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తుంగ కాలువలో అగ్నిమాపక సిబ్బంది క్రేన్ సాయంతో కారును కాలువ నుంచి బయటకు తీశారు. అప్పటికే చంద్రశేఖర్ మృతదేహం కుళ్లిపోయి ఉంది. ప్రమాద సమాచారం అందుకోగానే ఎమ్మెల్యే రేణుకాచార్య, ఆయన కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు వెనుక సీటులో చంద్రశేఖర్ మృతదేహం కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఎమ్మెల్యే రేణుకాచార్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.