దిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఓ కారు వేగంగా ఢీకొట్టింది. అనంతరం 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జ్ఞాన్‌చంద్ లేఖ్వాని(56).. అతడి కుటుంబ సభ్యులతో పుల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతడికి భార్య వందన(45) ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కాగా, జ్ఞాన్‌చంద్ అతడి భార్యతో ఓ సంగీత కచేరీకి హాజరై అర్ధరాత్రి స్కూటీపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి వెనుక నుంచి స్కూటీని బలంగా ఢీకొట్టింది. అనంతరం వారిద్దరిని ఈడ్చుకుంటూ 300 మీటర్ల వరకు వెళ్లి.. ఓ బ్రిడ్జ్ సైడ్వాల్ను బలంగా తాకింది. భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు వారు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో స్కూటీ మొత్తం నుజ్జునుజ్జవగా.. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పారిపోయాడు.
కుమారుడిని బలిచ్చిన తల్లి..
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. మూఢనమ్మకాలతో తన నాలుగేళ్ల కుమారుడిని కాళీమాత విగ్రహం ముందు బలిచ్చింది ఓ తల్లి.
ఇదీ జరిగింది.. శివకుమార్ అనే వ్యక్తి గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతడి భార్య మంజూదేవి(35) మూఢనమ్మకాలతో కొన్ని రోజులుగా క్షుద్రపూజలు చేస్తోంది. తన కోరికలు నెరవేరాలనే పిల్లవాడిని బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కోపంతో భార్య ముక్కు కొరికిన భర్త..
దిల్లీలోని జహంగీరిపుర్లో ఓ వ్యక్తి తన భార్యపై అతి కిరాతకంగా దాడి చేశాడు. జనవరి 3వ తేదీన చేత్రం అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దదై కోపం తెచ్చుకున్న చేత్రం ఒక్కసారిగా.. పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్‌తో చాలా సార్లు ఆమె శరీరంపై, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేశాడు. అప్పటికీ అతని కోపం తీరక ఛాతిపైకి ఎక్కి.. నోటితో ఆమె ముక్కును కొరికాడు. కుటుంబసభ్యులు వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని చేత్రంను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే నిందితుడు భార్యను కొట్టినందుకు గృహ హింస చట్టం కింద అరెస్ట్ అయి జనవరి 1నే విడుదలైనట్లు పోలీసులు వెల్లడించారు.