పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. ఆ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్గా నియమితులైనప్పటి నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన.. అమృత్సర్లోని తన నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధూ క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ డిమాండ్ చేస్తున్న వేళ.. ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రే క్షమాపణలు చెప్పాలని సిద్ధూ వర్గానికి చెందిన సింగ్ పేర్కొన్నారు. 'సీఎం కూడా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించలేదు.. అలాంటప్పుడు అమరిందర్ కూడా క్షమాపణలు చెప్పాలి' అని అన్నారు.
తొలగని విభేదాలు
పంజాబ్ పీసీసీ చీఫ్గా సిద్ధూను హైకమాండ్ నియమించినప్పటికీ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు సద్దుమణగలేదు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని అమరిందర్ సింగ్ చెప్పినా.. సిద్ధూతో విభేదాలు మాత్రం సమసిపోలేదు. పీసీసీ చీఫ్గా నియమితులైనప్పటి నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో సిద్ధూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కీలక నేతలందరినీ కలుస్తున్నారు. ఇప్పటికే.. కేబినెట్ మంత్రి తిపాఠ్ రజిందర్ సింగ్ బజ్వా నివాసంలో 35 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ సహా సుఖిందర్ సింగ్ రంధావ, సుఖ్విందర్ సింగ్ సుఖ్ సర్కారియా, రజియా సుల్తానా, చరణ్జిత్ సింగ్ ఛన్ని ఈ భేటీకి హాజరయ్యారు.