Amarinder Singh BJP : పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఆయన భాజపాలో విలీనం చేశారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిరణ్ రిజిజు సహా పంజాబ్ భాజపా అధ్యక్షుడు అశ్వినీ శర్మ పాల్గొన్నారు. అమరీందర్‌కు కండువా కప్పిన కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్.. భాజపాలోకి ఆహ్వానించారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీనేత, పంజాబ్ మాజీ ఉపసభాపతి అజైబ్ సింగ్ భట్టి కమలం పార్టీలో చేరారు. అయితే అమరీందర్ సింగ్ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ అమరీందర్ కొన్ని రోజుల క్రితం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
నడ్డాతో అమరీందర్ భేటీ..
అంతకుముందు సోమవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో దిల్లీలో అమరీందర్ సమావేశమై పలు విషయాలు చర్చించారు.
ఉపఎన్నికల సమయంలోనూ..
అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు వినిపించింది. ఆయన్ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటిస్తారని అమరీందర్ సింగ్ కార్యలయం ప్రకటించింది. కానీ భాజపా మాత్రం బంగాల్ మాజీ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించింది.