మధ్యప్రదేశ్ జిల్లా న్యాయమూర్తి శంభూ సింగ్ రఘువన్షీపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర హైకోర్టు తనపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారిణిపై లైంగిక వేధింపుల అభియోగాలను రఘువన్షీ ఎదుర్కొంటున్నారు. ఈ తరహా కేసుల్లో విచారణను న్యాయవ్యవస్థ ముసుగులో తప్పించుకోలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఉపసంహరించుకోండి..
సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా గల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ జూనియర్ జ్యుడీషియల్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర హైకోర్టు తనపై క్రమశిక్షణా చర్యలను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ జిల్లా జడ్జి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. జిల్లా జడ్జి తన పిటీషన్ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.