ఎన్నికలు అనగానే ఎవరైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఒక్కసారైనా విజయం సాధించకపోతామా అని కోరుకుంటారు. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంబేడ్కరీ హసనురామ్ మాత్రం అందుకు భిన్నం. ఇప్పటివరకూ 92 సార్లు బరిలోకి దిగిన ఆయన.. ఒక్కసారీ గెలవలేకపోయారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి నామినేషన్ వేశారు 74ఏళ్ల అంబేడ్కరీ. పైగా ఓటమి కోసమే నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు. ఎందుకిలా?
ఆగ్రా జిల్లా ఖైరాగఢ్కు చెందిన 1947 ఆగస్టు 15న జన్మించిన అంబేడ్కరీ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(మన్రేగా) కింద కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1985 నుంచి ఆయన ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ, ఒక్కసారీ గెలుపు ఆయన ఇంటి తలుపు తట్టలేదు.
తిరుగుబాటుదారుడిగా..
తొలిసారి ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఓ సైనికుడిలా పోరాడానని అంబేడ్కరీ చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారట. కానీ.. 'మీ భార్యే మిమ్మల్ని సరిగ్గా గుర్తించరు, అలాంటిది మీకెవరు ఓటేస్తారు?' అని స్థానికులు అవమానించారని చెప్పుకొచ్చారాయన. ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన హసను.. ఆ తర్వాత బీఎస్పీని వదిలి 1988లో ఖైరాగఢ్ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాటి నుంచి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వచ్చారు.
ఎలాంటి ఖర్చులేకుండా..