తమకు వ్యాక్సిన్లు అందించాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ క్రమంలో.. కెనడాకు భారత్ అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తుందని ట్రూడోకు మోదీ హామీనిచ్చారు.
కరోనాపై ప్రపంచం విజయం సాధిస్తే.. అది భారత్ వద్ద ఉన్న అపారమైన ఫార్మా సామర్థ్యం, దానిని ఇతర దేశాలకు పంచుకునే విషయంలో మోదీ నాయకత్వం వల్లేనని ట్రూడో అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అదే సమయంలో కెనడాలో టీకా అవసరాల గురించి మోదీకి ట్రూడో వివరించారు. ఫలితంగా.. భారత్ తన వంతు కృషి చేస్తుందని మోదీ ఆయనకు హామీనిచ్చారు.
"నా మిత్రుడు ట్రూడో నుంచి ఫోన్ రావడం ఎంతో సంతోషకరం. కెనడాకు భారత టీకాలు అందించే విషయంపై ట్రూడోకు హామీనిచ్చాను. వాతావరణ మార్పు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై పరస్పర సహకారం కొనసాగించాలని ఇద్దరం అంగీకరించాము."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.