తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Cancer Patient Gave Birth To Child : గర్భం దాల్చిన సమయంలోనే క్యాన్సర్.. పండంటి బిడ్డకు జన్మ.. ఆ తర్వాతే.. - cervical cancer pregnancy management

Cancer Patient Gave Birth To Child : ఓ గర్భిణీ క్యాన్సర్​తో పోరాడి ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గర్భాశయ క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ మహిళ అరుదైన పరిస్థితికి ప్రత్యేక చికిత్సా విధానం రూపొందించి విజయవంతంగా ప్రసవం చేశారు వైద్యులు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Cancer Patient Gave Birth To Child
Cancer Patient Gave Birth To Child

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 10:08 AM IST

Cancer Patient Gave Birth To Child :ఓ గర్భిణీ క్యాన్సర్​తో పోరాడుతూ ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గర్భాశయ క్యాన్సర్ (cervical cancer) ​తో బాధపడుతున్న ఓ 39 ఏళ్ల మహిళకు 37వ వారంలో విజయవంతంగా డెలివరీ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మిజోరం రాష్ట్రానికి చెందిన మెరీనా సీహెచ్​ రాల్టే అనే మహిళ గర్భం దాల్చిన తర్వాత గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు 16వ వారంలో వైద్యులు గుర్తించారు. మెరీనా గర్భాశయంలో 7 సెంటీ మీటర్ల పొడవున్న కణతి ఉన్నట్లు నిర్ధరించారు. అటు క్యాన్సర్​, ఇటు గర్భంతో ఒకే సారి రెండు సవాళ్లను మెరీనా ఎదుర్కొంది. దీంతో ఆమెకు ప్రత్యేకమైన చికిత్సా విధానం అవసరమైంది.

తన కూమార్తెతో మెరీనా

ఈ నేపథ్యంలో.. దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలోని అపోలో క్యాన్సర్ సెంటర్, మెడికల్ ఆంకాలజిస్టులు, గైనకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టులు, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌లు, రేడియేషన్ ఆంకాలజిస్టులతో కూడిన వైద్య బృందం సమగ్ర చికిత్స ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం మెరినా ఏడు వారాల కీమోథెరపీ చేయించుకుంది.

తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యులు జాగ్రత్తగా కీమోథెరపీ నిర్వహించారు. దీంతో 37వ వారంలో లోయర్​ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ (ఎల్​ఎస్​సిఎస్) చేయించుకుని ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది మెరీనా. ప్రసవం అయిన తర్వాత కూడా కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ కొనసాగించింది. అనతంరం బ్రాకీథెరపీ (నేరుగా క్యాన్సర్ ఉన్న ప్రదేశానికి రేడియేషన్​ థెరపీ అందించే ప్రత్యేక చికిత్స విధానం) చేయించుకుంది.

మెరీనా కుమార్తె

చికిత్స సమయంలో మెరీనాకు విపరీతమైన రక్తస్రావం అయిందని అపోలో క్యాన్సర్ సెంటర్ మెడికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పీకే దాస్ చెప్పారు. అప్పుడు ఆమెకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించిందని.. రెండో దశ కీమోథెరపీలో రక్తస్రావం ఆగిపోయిందని తెలిపారు.
ప్రసవానంతరం శిశువు ఆరోగ్యాన్ని నిశితంగా పరశీలిస్తున్నామని ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ అధ్యయనం ప్రకారం 1 నుంచి 3 శాతం మందికి ప్రెగ్నెన్సీ లేదా ప్రసవం అయిన తర్వాత ఈ గర్భాశయ క్యాన్సర్​ నిర్ధరణ అవుతోందని వెల్లడించింది.

తన కుమార్తెతో మెరీనా

క్లిష్టమైన చికిత్సను సాధ్యం చేసిన వైద్యులకు మెరీనా కృతజ్ఞతలు తెలిపింది. "నా బిడ్డను మోస్తున్నప్పడు క్యాన్సర్‌ను ఎదుర్కోవడం చాలా సవాలుగా ఉంది. కానీ దిల్లీలోని ఏసీసీలో నాకు చికిత్స లభించింది. దీంతో పాటు పూర్తి సపోర్ట్ కూడా లభించింది. అది కొత్త ఆశాకిరణాన్ని చూడటానికి సహాయపడింది" అని మెరీనా తన అనుభవాలను పంచుకుంది.

భర్త, కుమార్తెతో మెరీనా

'ఓకేసారి గర్భం దాల్చడం, క్యాన్సర్‌ రావడం చాలా అరుదు. ఈ కేసులు సవాలుగా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్​ వచ్చిన శరీర భాగాన్ని తీసేయడం సాధ్యం కాదు. ఆమె ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మెరీనాకు చికిత్స విధానం రూపొందించాం' అని ఏసీసీ రేడియేషన్​ ఆంకాలజిస్ట్​ డాక్టర్​ మనో భదౌరియా వివరించారు.

గర్భాశయ క్యాన్సర్ ప్రమాద హెచ్చరికలు ఇవే..

క్యాన్సర్​ వస్తే మరణం తప్పదా.. ఇది ఎంతవరకు నిజం?

ABOUT THE AUTHOR

...view details