దేశంలో బూస్టర్ డోసుల పంపిణీపై చర్చలు జరుగుతున్న సమయంలో దిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా పనిచేస్తాయనే అంశంపైనే బూస్టర్ షాట్ వినియోగం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
"బూస్టర్ డోసు వినియోగంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. యాంటీబాడీల ఆధారంగా బూస్టర్ షాట్‌ను ఇవ్వలేం. అది సమయం మీద ఆధారపడి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత బూస్టర్ డోసు గురించి ఆలోచించాలి. అయితే దీనిపై మరింత సమాచారం అవసరం."
-రణ్‌దీప్ గులేరియా
మూడో డోసు వినియోగంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు గులేరియా తెలిపారు. ఈ టీకాపై ప్రభుత్వం వచ్చే ఏడాదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. వైరస్ ప్రభావం అధికంగా ఉండేవారు, వృద్ధులకే మొదట ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.