కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. టీకా తీసుకునే సమయంలో వచ్చే నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా, కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, లేదా తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్లను వాడకపోవడమే మంచిదని స్పష్టం చేస్తున్నారు. వీటిపై ఆధారాలు తక్కువగానే ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ పనితీరును నొప్పి నివారణ మందులు(పెయిన్ కిల్లర్లు) ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు.
శరీరంలో వైరస్ ఉందని భావించి, వాటిని ఎదుర్కొనే రోగనిరోధకత కణాల పెరుగుదలకు మనం తీసుకునే వ్యాక్సిన్‌లు కృషిచేస్తాయి. అయితే, వీటి ప్రతిచర్యలో భాగంగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు కొందరు నొప్పి నివారణ మందులను వాడతారు. ఇలాంటి నొప్పులను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మందులు.. రోగనిరోధకత ప్రతిస్పందనకు ఆటంకం కలిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ లక్షణాలే రోగనిరోధక శక్తి పుంజుకుంటుందని, వ్యాక్సిన్ పనిచేస్తుందనడానికి నిదర్శనం. అనారోగ్య సమస్యలతో తీసుకునే పెయిన్ కిల్లర్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే రోగనిరోధకతను అడ్డుకునే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం(సీడీసీ) నిపుణులు డాక్టర్ రోచెల్లీ వాలెన్‌స్కై స్పష్టంచేశారు. ఇలాంటి మందులు వ్యాక్సిన్ వల్ల వృద్ధిచెందే యాంటీబాడీల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇటీవల ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. తాజాగా వీటికి సంబంధించిన పరిశోధన పత్రం జర్నల్ ఆఫ్ వైరాలజీలో ప్రచురితమైంది.