ఎన్నికల సంఘం (ఈసీ)లో ఇద్దరే ఉన్నప్పుడు.. అది దాఖలు చేసే ప్రమాణపత్రాన్ని అందులో ఒకరే ఆమోదిస్తే దాన్ని ఈసీ పరిపూర్ణ అభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మీడియాపై నియంత్రణ తదితర అంశాలపై మద్రాస్ హైకోర్టులో తొలుత విజ్ఞాపన.. అనంతరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు అంశాలపై ఈసీలో అభిప్రాయభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మీడియాపై నియంత్రణ అంశానికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషనర్లలో ఒకరు అభ్యంతరం తెలిపినప్పటికీ దాన్ని పట్టించుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీడియాది సానుకూల పాత్రేనని ఈసీలోని ప్రతిఒక్కరూ భావిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేయాలని చూస్తోంది. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టులో ఈసీ ప్రమాణపత్రాన్ని దాఖలు చేయాలని.. సంస్థగా తాను వేరువేరుగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని అభ్యంతరం తెలిపిన ఎన్నికల కమిషనర్ భావించినా ఓ సంస్థగా ఈసీ దాన్ని తిరస్కరించడం వల్ల ఇది కార్యరూపం దాల్చలేదు.
'సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీతో పాటు వేరుగా ప్రమాణపత్రాన్ని తాను దాఖలు చేయడానికి ఆయన చేసిన విజ్ఞప్తిని కూడా ఈసీ తిరస్కరించింది' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.