తనకు రూ.10 లక్షల రుణం మంజూరు చేయకపోతే బ్యాంక్ శాఖను పేల్చేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు కాల్ చేశాడు. ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారాను కిడ్నాప్ చేసి హతమారుస్తామంటూ ఫోన్‌లో బెదిరించాడు. ముంబయిలో ఉన్న ఓ బ్యాంకు శాఖకు వచ్చిన బెదిరింపు కాల్ ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
దక్షిణ ముంబయిలోని నారీమన్ పాయింట్‌లో ఉన్న ఎస్‌బీఐ కార్యాలయానికి బుధవారం ఉదయం ఓ ఫోన్ వచ్చింది. తనపేరు మహ్మద్‌జియా ఉల్ అలీ అని, తనకు బ్యాంక్ రూ.10 లక్షలు మంజూరు చేయాలని కోరాడు. లేకపోతే ఎస్‌బీఐ ఛైర్మన్‌ను కిడ్నాప్ చేసి హతమారుస్తానని బెదిరించాడు. ఎస్‌బీఐ కార్పొరేట్ ఆఫీసును పేల్చివేస్తానని ఫోన్‌లో హెచ్చరించాడు. దీనిపై బ్యాంక్ సెక్యూరిటీ మేనేజర్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఈ కాల్ వచ్చిందని ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం పశ్చిమబెంగాల్ బయల్దేరి వెళ్లిందని పోలీసులు తెలిపారు.