Delhi CM House Renovation : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ ఇచ్చింది కేంద్రం. సీఎం అధికారిక నివాసం పుననిర్మాణంలో నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై చర్యలకు సిద్ధమైంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీనిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుందని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.
అంతకుముందు దిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం పుననిర్మాణంలో అవకతవకలు జరిగాయని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ఈ మేరకు కాగ్‌తో ఆడిట్ చేయించాలని మే 24న కేంద్ర హోం శాఖకు ప్రతిపాదిస్తూ లేఖ రాశారు. దీనిపై చర్యలు తీసుకున్న హోం శాఖ.. స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు సూచించింది.
ఈ వ్యవహారంపై దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. కేంద్రం నిర్ణయాన్ని ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని.. ఆ పార్టీలోని నైరాశ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించింది. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునర్నిర్మాణంపై గతేడాదే కాగ్ పరిశీలన జరిపిందని, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.
సివిల్ లైన్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం- షీశ్ మహాల్‌ను పుననిర్మించింది దిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రజాపనుల శాఖ. ఈ నిర్మాణానికి మొదట రూ. 15-20 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఈ నివాసంపై రూ. 53 కోట్లు ఖర్చు చేశారు. నిబంధనలు అతిక్రమించి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేశారని లెఫ్టినెంట్ గవర్నర్.. కేంద్రం హోం శాఖకు లేఖ రాశారు.