ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంతో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్టోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్ దేశాల్లో భారత కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఈ మూడు దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలనేదే ప్రధాని మోదీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
పారాదీప్‌కు రూ.3వేల కోట్ల ప్రాజెక్టు..
పారాదీప్ ఓడరేవును అత్యాధునిక హంగులతో తీర్చిదిద్ది ప్రపంచస్థాయి నౌకాశ్రయంగా మార్చేందుకు రూ.3వేల కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది కేబినెట్. అక్కడ వెస్టర్న్ డాక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పారిశ్రామిక కారిడార్లు..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ అండ్ మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.7,725 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. వీటి వల్ల సుమారు 2.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది.