తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రుణాలపై వడ్డీ రాయితీ, వారికి మోదీ సర్కార్ గుడ్​న్యూస్

అన్నదాతలు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీ పునరుద్ధరించింది కేంద్రం. రూ.3లక్షల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ వ్యయాన్ని రూ.50వేల కోట్ల నుంచి రూ.5లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించింది.

CAB CROP LOAN
CAB CROP LOAN

By

Published : Aug 17, 2022, 4:44 PM IST

Cabinet decision today: అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది! వ్యవసాయ రుణాల వడ్డీపై రాయితీ ప్రకటించింది. రూ.3లక్షలు లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ రంగానికి తగినంత రుణ లభ్యత జరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

Union Cabinet meeting: "స్వల్పకాల వ్యవసాయ రుణాలకు వడ్డీ రాయితీ పునరుద్ధరించాలని ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రుణాలు అందించే అన్ని ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ అందనుంది. 2022-23, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు గానూ రూ.3లక్షల లోపు రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. దీని వల్ల బడ్జెట్​పై రూ.34,856కోట్లు ప్రభావం పడుతుంది" అని కేంద్ర మంత్రి వివరించారు. వడ్డీ రాయితీ వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరగడమే కాకుండా, రుణాలు జారీ చేసే సంస్థలు సైతం ఆర్థికంగా పుంజుకుంటాయని మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ వ్యయాన్ని రూ.50వేల కోట్ల నుంచి రూ.5లక్షల కోట్ల రూపాయలకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అదనపు మొత్తాన్ని సేవా సంబంధిత రంగాల్లోని సంస్థలకు కేటాయించనున్నారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగానికి ఆర్థిక సాయం చేసేందుకు అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ పరిమితిని నాలుగున్నర లక్షల కోట్ల నుంచి.. రూ.5 లక్షల కోట్లకు పెంచుతామని కేంద్రం ప్రతిపాదించింది.

సేవా సంబంధిత రంగాల్లో కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా ఈ మొత్తాన్ని పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద 2022 ఆగస్టు 5 వరకు దాదాపు 3.67 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని ఆయన చెప్పారు. అదే సమయంలో, టూరిజం, ఆతిథ్య రంగాలకు అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్​ను రూ.50 వేల కోట్లకు పెంచుతున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details