రైల్వేలో పని చేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త అందించింది కేంద్రం. 78 రోజుల వేతనం బోనస్‌గా ఇవ్వాలని కేంద్రమంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో.. మొత్తం 11.50 లక్షల మంది రైల్వే ఉద్యోగలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీని కోసం రూ.1,985 కోట్లు అవసరమవుతాయన్నారు. ఏటా దసరా, దుర్గా పూజా సందర్భంగా ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తోంది కేంద్రం.
పీఎం మిత్రా పార్కులు
దేశంలో వచ్చే ఐదేళ్లలో 7 పీఎం మిత్రా పార్కులు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్.
" 5 ఏళ్లలో 7 పీఎం మిత్రా( మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అప్పారెల్) పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.4,445 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. "
- పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి.
పీఎం మిత్రా పార్కుల ఏర్పాటు ద్వారా నేరుగా 7 లక్షలు, పరోక్షంగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు గోయల్.