Cabinet Approves Fertilisers Subsidy : రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రబీ పంట సీజన్‌లో (2023 అక్టోబర్ 1 - 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి వివిధ పోషకాల కోసం ఎరువుల సబ్సిడీ రేట్లను (NBS) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ.. రైతులు మాత్రం డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఎరువును బస్తాకు పాత ధర రూ.1,350 మాత్రమే చెల్లించి తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు.
తాజా నిర్ణయంతో కిలో నత్రజనిపై రూ.47.2, కిలో ఫాస్ఫరస్పై రు. 20.82, కిలో పొటాష్పై రూ.2.38, కిలో సల్ఫర్పై రూ.1.89 సబ్సిడీ లభించనుంది. ఇక టన్ను డీఏపీకి రూ.4500 సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం. ఎన్‌పీకే ఎరువు బస్తా రాయితీ ధర రూ.1470 లభించనుంది.
రైతులకు సులభంగా, అందుబాటు ధరలో ఎరువులు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ (మ్యూరియెట్ ఆఫ్ పొటాష్), సల్ఫర్ వంచి ఎరువుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రైతులకు తక్కువ ధరలో ఎరువులు లభ్యమయ్యేలా.. ఆమోదించిన రేట్ల సబ్సిడీని ఎరువుల తయారీ కంపెనీలకు చెల్లిస్తామని వెల్లడించింది.