పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) సకాలంలో అమలు చేస్తామన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అసోంలో మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమని కాంగ్రెస్ చెప్పడం అవివేకమని, లేదా ప్రజలను పిచ్చివాళ్లను చేయడమేనని విమర్శించారు.
మేనిఫెస్టో విడుదల చేస్తోన్న జేపీ నడ్డా "కాంగ్రెస్ విధానాలు సమస్యాత్మకమే కాదు, ప్రమాదకరం కూడా. అసోంను మహోన్నత శంకరదేవ, భారతరత్నాలు డా.భూపేన్ హజారికా, గోపీనాథ్ బోర్డోలోయ్తో గుర్తిస్తాం. అలాంటిది బద్రుద్దీన్తో దానిని గుర్తిద్దామా? సాంస్కృతిక మార్పులను గౌరవిస్తూనే.. అసోం గుర్తింపును, సంస్కృతిని సంరక్షిస్తాం. సరిహద్దు నిర్వహణను మెరుగుపరుస్తాం. అసోం ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
అసోం శాసనసభ ఎన్నికలకు ఆత్మనిర్భర్ అసోం, ఎన్ఆర్సీ సవరణ సహా 10 ముఖ్యమైన హామీలిచ్చింది భాజపా.
- హద్దులను నిర్ణయించడం ద్వారా ప్రజల రాజకీయ హక్కుల పరిరక్షణ
- వరదల ముప్పును ఎదుర్కోవడానికి 'మిషన్ బ్రహ్మపుత్ర' ప్రారంభం. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నుంచి మిగులు జలాల నిల్వలకు జాలాశయాల నిర్మాణం
- మహిళల ఆర్థిక సాధికారతకు 'అరుణోదయ' పథకం ద్వారా అందిస్తున్న రూ.830ని రూ.3వేలకు పెంపు
- ఆక్రమణలకు గురైన ప్రార్థనా స్థలాల భూములను తిరిగి పొందేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు
- అసోంలో ప్రతి చిన్నారికి ఉచిత విద్య, 8 నుంచి పైతరగతుల వారికి ఉచిత సైకిళ్లు
- యువతకు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు (అందులో 2022 మార్చి 31 నాటికి లక్ష), ప్రైవేట్ రంగంలో 8లక్షల ఉద్యోగాల కల్పన
- వచ్చే ఐదేళ్లలో 10లక్షల వ్యవస్థాపకులను తయారుచేయడం
- ఆహార ఉత్పత్తుల్లో స్వాలంబనకు సాంకేతిక, ఆర్థిక చేయూత
- అర్హులకు దశలవారీగా భూ పట్టాలు
ఇదీ చూడండి:'సీఏఏ, భాజపాను ఓడించాలనేదే ప్రజల కోరిక'