హిందూ, ముస్లింల మధ్య అంతరాలకు పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ), జాతీయ పౌర పట్టికలతో (ఎన్‌ఆర్‌సీ) ఏ మాత్రం సంబంధంలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అధినేత (సర్‌సంఘచాలక్) మోహన్ భాగవత్ పేర్కొన్నారు. పౌరసత్వ చట్టాల వల్ల ఏ ఒక్క ముస్లింకు నష్టం జరగదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గువాహటిలో బుధవారం ఆయన ప్రొఫెసర్ నాని గోపాల్ మహంత రాసిన 'సిటిజెన్‌షిప్ డిబేట్ ఓవర్ ఎన్‌ఆర్‌సీ అండ్ సీఏఏ' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పాల్గొన్నారు.
"స్వాతంత్ర్యానంతరం మైనారిటీల సంరక్షణకు దేశ తొలి ప్రధాని హామీ ఇవ్వడం సహా దానిని అమలుపరిచారు. పారుగు దేశాలలో వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వ నవరణ చట్టం రక్షణ కల్పిస్తుంది. విపత్తు సమయాల్లో ఈ దేశాల్లోని మెజారిటీ ప్రజలకూ సాయం చేశాం."
-మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ అధినేత