ఐదు రాష్ట్రాల్లోని ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే విధంగా కేంద్రం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐయూఎమ్ఎల్(ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
సీఏఏ(2019 పౌరసత్వ సవరణ చట్టం) రాజ్యాంగబద్ధతకు సంబంధించిన పిటిషన్‌ను తాజా వ్యాజ్యంలో ప్రస్తావించింది ఐయూఎమ్ఎల్. నిబంధనలను ఇంకా రూపొందించని కారణంగా సీఏఏపై స్టే విధించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం ఇచ్చిన హామీని గుర్తుచేసింది. తాజా చర్యలతో.. పిటిషన్‌కు అడ్డం రాకుండా, వేరే మార్గాలను కేంద్రం వెతుకుతోందని ఆరోపించింది. ఈ చర్యలు అక్రమమని.. సీఏఏలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
2014 డిసెంబర్ 31 వరకు.. దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీలైన సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వాన్ని అందించేందుకు 2019లో సీఏఏను తీసుకొచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. అయితే.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి.. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల్లో నివసిస్తున్న ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని నిబంధనల కింద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌తో చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:-సీఏఏ నిబంధనల రూపకల్పనకు గడువు పెంపు