Bypoll results : దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూసిన ఉపఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్ వర్గం) చెరొక స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి.
ఉత్తర్‌ప్రదేశ్..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్ శాసనసభ సీటుకు జరిగిన ఉపఎన్నికలో అధికార భాజపా పట్టు నిలుపుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై భాజపా అభ్యర్థి అమన్గిరి 34,298 ఓట్ల తేడాతో గెలుపొందారు. భాజపా అభ్యర్థి అమన్గిరి 1,24,810 ఓట్లు సాధించగా.. ఎస్పీ అభ్యర్థి వినయ్ తివారీకి 90,512 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో గోల గోఖర్నాథ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అరవింద్ గిరి స్థానంలో ఆయన కుమారుడు అమన్‌గిరిని భాజపా బరిలో దింపింది.
హరియాణా..
హరియాణాలోని అధంపుర్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్‌పై 15,714 ఓట్ల తేడాతో భవ్య బిష్ణోయ్ విజయ కేతనం ఎగురవేశారు. అంతకుముందు అధంపుర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. కుల్దీప్ స్థానంలో ఆయన కుమారుడు భవ్య బిష్ణోయ్‌ను అధికార భాజపా బరిలో దింపి విజయం సాధించింది.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉపఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి రుతుజా లట్కే విజయకేతనం ఎగురవేశారు. ఈ ఏడాది మేలో శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన భార్య రుతుజా లట్కే శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) తరపున బరిలో దిగారు. ఆమెకు 66,247 ఓట్లు రాగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్న నోటాకు 12,776 ఓట్లు రావడం విశేషం.
భాజపా అభ్యర్థి ఈ ఎన్నికలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ బరిలో లేకపోవడం వల్ల శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. మహా వికాస్ అఘాడీ కూటమిలోని భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ.. శివసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి.