Buses Fire At Bangalore :కర్ణాటక.. బెంగళూరులోని ఓ గ్యారేజీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 22 బస్సులు దగ్ధమయ్యాయి. వీరభద్రనగర్లో ఉన్న గ్యారేజీలో సోమవారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
SV కోచ్ గ్యారేజీలో కొత్త, పాత బస్సు ఇంజిన్లకు బాడీ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి గ్యారేజీలో ఉన్న బస్సులకు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. గ్యారేజీలో మొత్తం 35 బస్సులు ఉన్నాయని, అందులో 22 బస్సులకు మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.
'గ్యారేజీలోని బస్సులకు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నారు. వెల్డింగ్ మెషీన్ నుంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలే మంటలకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత మంటలు ఇతర బస్సులకు వ్యాపించాయి. దీంతో గ్యారేజీలోని బస్సులకు భారీ నష్టం వాటిల్లింది.'
-పోలీసు అధికారి
'బహిరంగ ప్రదేశంలో గ్యారేజీ.. తప్పిన ముప్పు'
మంటలు వ్యాపించగానే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. మంటలను పూర్తిగా ఆర్పేశాయి. 18 బస్సులు పూర్తిగా పూర్తిగా కాలిపోయాయని, మరో నాలుగు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. గ్యారేజీ బహిరంగ ప్రదేశంలో ఉండటం వల్ల.. మంటలు చెలరేగగానే.. అంతా దూరంగా వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.