Bus Shelter Theft Case Twist :కర్ణాటక బెంగళూరు నగరంలో ఇటీవల బస్‌స్టాప్ చోరీకి గురైన కేసు మలుపు తిరిగింది. ఆ బస్‌స్టాప్ చోరీ కాలేదని.. నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల అధికారులే అక్కడి నుంచి తరలించారని దర్యాప్తులో తేలింది. మరోవైపు నాణ్యత లేకుండా నిర్మించారంటూ సంబంధింత కంపెనీపై తిరిగి కేసు నమోదు చేశారు అధికారులు.
ఇదీ జరిగింది..
నగరంలోని కన్నింగ్‌హామ్ రోడ్లో బస్‌స్టాప్ నిర్మాణానికి సైన్బోర్డ్ అనే కంపెనీకి అనుమతి ఇచ్చింది బృహత్ బెంగళూరు మహానగర పాలకె(బీబీఎంపీ) . ఈ నేపథ్యంలోనే ఆగస్టు 21న రూ.10లక్షల విలువైన బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేసింది సంబంధిత సంస్థ. అనంతరం ఆగస్టు 27 ఈ బస్‌స్టాప్‌ను పరిశీలించేందుకు కంపెనీ ప్రతినిధులు రాగా.. అది కనిపించలేదు. వెంటనే బీబీఎంపీ అధికారులను సంప్రదించారు సంస్థ ప్రతినిధులు. అయితే, బస్‌స్టాప్‌ను తాము తరలించలేదని అధికారులు చెప్పడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది నిర్మాణ సంస్థ.
సెప్టెంబర్ 30న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాణ్యత లేకుండా నిర్మించారంటూ ఫిర్యాదు రావడం వల్ల స్థానిక శివాజీనగర్ ఈఈ బస్‌స్టాప్‌ను పరిశీలించారు. నాణ్యత లేకుండా ఉండడం వల్ల బస్‌స్టాప్‌ను అక్కడి నుంచి గోడౌన్‌కు తరలించినట్లు తేలింది. ఈ విషయం తెలియని నిర్మాణ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నాణ్యత లేకుండా నిర్మించారంటూ సంబంధింత కంపెనీపై తిరిగి కేసు నమోదు చేశారు అధికారులు.