లారీని ఢీకొట్టిన బస్సు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 14 మంది సజీవదహనం - నాసిక్ వార్తలు
06:53 October 08
బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 14 మంది సజీవదహనం
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మంటల్లో చిక్కుకుని 14 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం..శుక్రవారం రాత్రి యవత్మాల్ నుంచి నాసిక్ వైపు 30 మందికి పైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్‌లోని హోటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పి ట్రక్కును బస్సు ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. అయితే బస్సు వెంటనే మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రపోతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నాసిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చాలా మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని సజీవదహనం కావడాన్ని తన కళ్లతో చూసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. బాధితులను రక్షించేందుకు యత్నించినప్పటికీ భారీ మంటలు కారణంగా సాధ్యపడలేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు 2 లక్షల పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి 50వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.