ఉత్తరాఖండ్ పౌడీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 33 మంది మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. ధూమకోట్ వద్ద రిఖినికల్- బిరోఖాల్ రహదారిపై వెళ్తున్న ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతున్న న్యార్ నదిలో పడిపోయింది. మంగళవారం రాత్రి 7.30 సమయంలో జరిగిన ఈ దుర్ఘటన.. అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
పెళ్లికి వెళ్తూ..
ప్రమాదానికి గురైన బస్సు.. పెళ్లి బృందంతో వెళ్తోంది. హరిద్వార్‌లోని లాల్గఢ్కు చెందిన నంద్ రామ్ అనే యువకుడి వివాహం కోసం.. అతడి బంధుమిత్రులు దాదాపు 46 మంది కలిసి మంగళవారం మధ్యాహ్నం పౌడీ జిల్లాలోని కాండా గ్రామానికి బస్సులో బయలుదేరారు. మంగళవారం ఏడున్నర గంటలయ్యే సరికి.. వారు గమ్యస్థానానికి దాదాపు చేరువయ్యారు. ఇంతలోనే అనూహ్య సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బిరోఖాల్ ప్రాంతంలోని సిమ్డీ గ్రామం వద్ద రోడ్డు పక్కనున్న న్యార్ నదిలో పడిపోయింది.
ఈ ఘటనలో అనేక మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డవారిలో కొందరు.. అతి కష్టం మీద కొండ ఎక్కి, రోడ్డుపైకి వచ్చి.. అటుగా వెళ్తున్న వారికి విషయం చెప్పారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం(ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం సహాయక చర్యలు ముగిసినట్లు ఎస్డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు 33 మంది చనిపోయినట్లు తెలిపింది.18 మంది గాయపడ్డారని స్పష్టం చేసింది.