Bus driver suspended: బలహీనవర్గాలకు చెందిన వారిని హీనంగా చూడటం, వివక్ష, వారిపై తప్పుడు కేసులు పెట్టడం వంటి అంశాలను ఇటీవల వచ్చిన 'జై భీమ్' సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాంటి సంఘటనే తమిళనాడు, కన్యాకుమారిలో జరిగింది. ఫలితంగా అమానవీయంగా ప్రవర్తించిన బస్ డ్రైవర్, కండక్టర్ సస్పెండయ్యారు.
ఇదీ జరిగింది..
వల్లియూర్ గ్రామంలోని నరిక్కురవార్స్ సమాజానికి చెందిన కొందరు నాగర్‌కోయిల్ బస్టాండ్‌లో సూదులు, గొలుసులు, పిన్నీసులు వంటివి విక్రయిస్తుంటారు. సాయంత్రానికి తిరునెల్వెలి రూట్ బస్ ద్వారా స్వగ్రామానికి చేరుకుంటారు. గురువారం(డిసెంబర్ 9న) నరిక్కురవార్స్కు చెందిన ఓ వృద్ధుడు.. చిన్న పిల్లాడు, మహిళతో వల్లియూర్కు వెళ్లేందుకు నాగర్‌కోయిల్ బస్టాండ్‌లో బస్ ఎక్కారు. కొద్ది సమయానికి కండక్టర్ వారిని కోపగించుకుంటూ కిందకు దింపేశాడు. వారి సామగ్రిని బస్సులోనుంచి కింద పడేశాడు. ఈ సంఘటనను ఓ యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.