తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిడ్జ్​ పైనుంచి రైల్వే ట్రాక్​పై పడిన బస్సు- నలుగురు మృతి - రాజస్థాన్ బస్సు ప్రమాదం న్యూస్

Bus Accident in Rajasthan : రాజస్థాన్​లో జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. దౌసాలో సోమవారం వేకువజామున జరిగిందీ ఘటన.

Bus accident in Rajasthan
Bus accident in Rajasthan

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 8:10 AM IST

Updated : Nov 6, 2023, 8:59 AM IST

Bus accident in Rajasthan : వంతెనపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి.. కింద ఉన్న రైల్వే ట్రాక్​పై పడిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. రాజస్థాన్​లోని దౌసాలో జైపుర్​-దౌసా 21వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిందీ ప్రమాదం.

ప్రమాదానికి గురైన బస్సు.. 32 మందితో హరిద్వార్​ నుంచి ఉదయ్​పుర్ వెళ్తోంది. ఉదయం 2 గంటల 15 నిమిషాల సమయంలో దౌసాలోని కలెక్టరేట్ సర్కిల్​ ప్రాంతంలోని రైల్వే ఓవర్​బ్రిడ్జ్​పై వెళ్తుండగా.. వాహనం అదుపు తప్పింది. వంతెన గోడను ఢీకొట్టి.. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి రైలు పట్టాలపై పడింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలిసేలోపే ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు కాసేపటికే మృతిచెందారు.

బ్రిడ్జ్​ పైనుంచి రైల్వే ట్రాక్​పై పడిన బస్సు

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నందున.. మెరుగైన చికిత్స కోసం జైపుర్​ తరలించారు.

బస్సు-బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఉత్తర్​ప్రదేశ్​లోని సుల్తాన్​పుర్​లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సందీప్​ శర్మ(32), సంతోష్ శర్మ(26) ఓ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. కొత్వాలీ పోలీస్ స్టేషన్​ ప్రాంతంలోని ఓవర్​ బ్రిడ్జ్​పై వారి బైక్​ను ఆర్​టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్​మార్టం పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పెళ్లికి వెళ్తూ వరుడు దుర్మరణం
పంజాబ్​ మోగా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా నలుగురు మరణించారు. ఫిరోజ్​పుర్​-లుధియానా రహదారిపై ఆదివారం జరిగిందీ ఘటన.
సుఖ్వీందర్​ సింగ్​(23) వివాహం ఆదివారం లుధియానా జిల్లా బడ్డోవల్ గ్రామంలో జరగాల్సి ఉంది. బంధువులతో కలిసి సుఖ్వీందర్​ కారులో పెళ్లి మండపానికి వెళ్తుండగా.. వారి వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వరుడితోపాటు అతడి బంధువులు ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Last Updated : Nov 6, 2023, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details