నిరంతరం పొలంలో పనిచేస్తూ జీవనాధారంగా ఉన్న ఎద్దులపై వినూత్నంగా ప్రేమను చూపాడు ఓ వ్యక్తి. తన పెళ్లికి వాటిని అతిథులుగా తీసుకువచ్చాడు. అంతే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఓ స్టేజీని ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లిలో ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.
పెళ్లికి అతిథులుగా ఎద్దులు.. స్పెషల్‌గా స్టేజీ ఏర్పాటు.. ప్రేమను చాటుకున్న రైతు - కర్ణాటకాలో వినూత్న వివాహం
ఎద్దులపై తనకున్న ప్రేమను వినూత్నంగా చూపించాడు ఓ వ్యక్తి. తన పెళ్లి జరిగే హాల్‌కు తీసుకురావడమే కాకుండా.. వాటికోసం ప్రత్యేకంగా ఒక స్టేజ్‌ను ఏర్పాటు చేశాడు.
ఇదీ జరిగింది
చామరాజనగర్ జిల్లా నంజన్‌గూడు తాలూకా చిక్కహోమ్మా గ్రామానికి చెందిన మహేష్.. వృత్తి రీత్యా రైతు. అతడికి యోగిత అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం జరిగిన ఈ వేడుకకు తనకు వ్యవసాయంలో ఎంతో సాయం చేసిన రెండు ఎద్దులను ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకువచ్చాడు. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడు. వాటిని ఆకర్షనీయంగా ముస్తాబు చేశాడు. "మా అబ్బాయికి ఈ ఎద్దులంటే చాలా ఇష్టం. వీటి ధర రూ. రెండు లక్షల దాకా ఉంటుంది." అని వరుడి తండ్రి బసవరాజప్ప తెలిపారు. తన కోసం ఎంతో కష్టపడిన ఎద్దులపై యువకుడి చూపిన ప్రేమపై పలువురు ప్రశంసిస్తున్నారు.