తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళల వేలం పేరుతో వికృత చేష్టలు.. ఆ యాప్‌ బ్యాన్! - మహారాష్ట్ర వార్తలు తాజా

Bulli Bai App: ఓ వర్గానికి చెందిన మహిళలే లక్ష్యంగా 'బుల్లీ బాయ్​' యాప్​ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడటం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన పోలీసులు.. తమకు అందిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఈ యాప్​ను, సైట్​ను తొలగించినట్లు వెల్లడించారు.

d
ఆకతాయిల వికృత చేష్టలు.. ఆ యాప్‌పై నిషేధం!

By

Published : Jan 2, 2022, 12:19 PM IST

Bulli Bai App: అందివచ్చిన సాంకేతికతను అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి.. ఆకతాయిలు కంపరం పుట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకొని వారు సృష్టిస్తున్న అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టి అల్లరిపాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. 'బుల్లీ బాయ్‌' పేరిట యాప్‌ను సృష్టించి వికృత పనులకు పాల్పడుతున్న దుండగులపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. వందలాది మంది మహిళల చిత్రాలు యాప్‌లో ఉన్నట్లు సమాచారం. తన ఫొటోను కూడా దుండగులు యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఓ మహిళా జర్నలిస్టు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం వల్ల ఇటు ముంబయితో పాటు దిల్లీ పోలీసులు స్పందించారు. తమకు అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించామని తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసుల సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంత్రి సమాధానంపై స్పందించిన ప్రియాంక చతుర్వేది.. ఇంతటితో ఆగకుండా కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యాలయాలు దుండగులను కనిపెట్టడంలో సహకరించాలని కోరారు.

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొన్ని ఫొటోలను మార్చి దుండగులు బుల్లీ బాయ్‌ యాప్‌లో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన ఫొటోలను మాత్రమే ఉంచుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం కూడా 'సలీ డీల్స్‌' పేరిట ఓ యాప్‌ ఇదే తరహా కార్యకలాపాలకు ఒడిగట్టింది. దీనిపై అప్పట్లో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు దుండగులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'గిట్‌హబ్‌' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్రం గిట్‌హబ్‌కు సమాచారం అందించింది. పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరింది.

ఇదీ చూడండి :'ఫిబ్రవరిలోగా అందుబాటులోకి ఎస్​-400 క్షిపణి వ్యవస్థ'

ABOUT THE AUTHOR

...view details