Bulldozer Action in up Today on Hospital :ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రైవేటు ఆస్పత్రిపై బుల్డోజర్ చర్యకు పిలుపునిచ్చారు లఖ్‌నవూ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. తనను ఐసీయూ గదిలోకి రానివ్వలేదనే కారణంతో.. మేయర్ ఈ చర్యకు సిద్ధపడ్డారు. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి ప్రవేశిస్తుండగా అడ్డుకున్నామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. మేయర్ మాత్రం ఆస్పత్రి సిబ్బంది ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.
ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్పిన వివరాల ప్రకారం..
బిజ్నోర్‌లో ఉన్న వినాయక్ మెడికేర్ ఆస్పత్రిలో.. మున్సిపల్ ఉద్యోగి ఒకరు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆ రోగిని చూసేందుకు మిగతా సిబ్బందితో కలిసి.. లఖ్‌నవూ మున్సిపల్ మేయర్ సుష్మా ఖర్వాల్ సోమవారం అక్కడికి వెళ్లారు. షూ వేసుకుని ఐసీయూ గదిలోకి ప్రవేశిస్తున్న ఆమెను.. అస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు. షూ వేసుకుని లోపలికి వెళితే సూక్షజీవుల కారణంగా.. రోగి ఇన్ఫెక్షన్ బారిన పడతారని హెచ్చరించారు. షూ విప్పేసి ఐసీయూ గదిలోకి వెళ్లాల్సిందిగా ఆమెను కోరారు.
దీంతో ఆగ్రహానికి గురైన మున్సిపల్ మేయర్ సుష్మా ఖర్వాల్.. ఆస్పత్రి సిబ్బందిపై దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే మేయర్, ఆస్పత్రి మేనేజ్మెంట్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం బుల్డోజర్ఆస్పత్రి వద్దకు రావాలని మున్సిపల్ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌ను ఆదేశించారు మేయర్. వెంటనే వారంతా అక్కడికి చేరుకోవడం వల్ల ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర రసాభాస జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.